telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజల గొంతులో ప్రాణాంతకమైన మద్యం: సోమిరెడ్డి

somireddy chandramohan

ఏపీలో మద్యం దుకాణాలు నిన్న తెరచుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా దుకాణాల్లో విక్రయించే లిక్కర్ నాణ్యతపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రాణాంతకమైన మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల గొంతులో పోస్తున్నారని ఆరోపించారు.

వైన్ షాపుల్లో విక్రయించే లిక్కర్ ను వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుందని హెచ్చరించారు. ఎన్నడూ వినని బ్రాండ్స్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావట్లేదని విమర్శించారు. నాణ్యత లేని మద్యం తయారు చేసే డిస్టిలరీలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నాణ్యతలేని మద్యాన్ని విక్రయించడమే కాకుండా వాటి ధరలు పెంచడం మరింత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

తెలంగాణలో విక్రయించే పాత బ్రాండ్స్ నే ఇక్కడ కూడా విక్రయించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మద్యం దుకాణాలు తెరిచామని ఏపీ మంత్రులు చెప్పడం సరికాదని అన్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసే ఉంచాలని డిమాండ్ చేశారు.

Related posts