కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నాదెండ్ల భాస్కరరావు విమర్శించారు. ఈ చట్టం గురించి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పౌరసత్వ చట్టం ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు.
దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టమని ఎవరూ చెప్పడం లేదని అన్నారు. ఈ చట్టంపై లోక్ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా ఉందని అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. అల్లర్లు చేయడం దేశంలో కొందరికి ఒక అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.