ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. రెండ్రోజులపాటు ఢిల్లీ వెళ్లిన సీఎం.. హోం మంత్రి అమిత్ షాను కలిశారు. సోమవారమే ఆయన హోం మంత్రిని కలవాల్సి ఉన్నప్పటికీ.. అపాయింట్‌మెంట్ లభించలేదు. దీంతో మంగళవారం కలిశారు. వీరిద్దరూ అరగంట సేపు భేటీ అయ్యారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అమిత్ షాతో భేటీ కోసం వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ రెండు నెలల్లో మూడుసార్లు ఆయనకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను హోం మంత్రి కార్యాలయం రద్దు చేసింది. ఎట్టకేలకు మంగళవారం.. అమిత్ షా పుట్టిన రోజున ఆయన్ను కలిసిన జగన్.. బర్త్ డే విషెస్ చెప్పి.. వినతిపత్రం ఇచ్చారు. ఈ భేటీలో అమిత్ షాతో ఎక్కువ సేపు మాట్లాడటానికి జగన్‌కు సమయం చిక్కలేదని ప్రచారం జరుగుతోంది. హోం మంత్రి పుట్టిన రోజు కావడంతో.. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. సోమవారం జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని అమిత్ షా.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో 15 నిమిషాలపాటు మాట్లాడటం గమనార్హం. దీంతో జగన్‌కు అమిత్ షా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావన వ్యక్తమైంది. దీంతో వైఎస్ఆర్సీపీ వర్గాలు అసంతృప్తికి లోనయ్యాయి. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జగన్.. ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనకు అధిక ప్రాధాన్యం లభించింది. కానీ ఇటీవల ఆయనతో అమిత్ షా వ్యవహరిస్తున్న తీరు జగన్ అభిమానులకు రుచించడం లేదు.
అదీగాక.. అక్టోబర్ తొలివారంలో అమిత్ షాను కలవడానికి జగన్ ప్రయత్నించగా.. భేటీ కుదరలేదు. కానీ మరుసటి రోజే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. ఎన్నికల ముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎలాంటి కథనాలు వచ్చాయో తెలిసిందే. కానీ ఆర్కేకు టైం ఇచ్చిన అమిత్ షా.. జగన్ విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటనే ప్రశ్న వైఎస్ఆర్సీపీతోపాటు బీజేపీ శ్రేణుల్లోనూ వ్యక్తం అవుతోంది. ఏపీలో బలపడటం మీద ఫోకస్ పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. జగన్ నిర్ణయాలు నచ్చకపోవడం కూడా కారణమేనంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం సీబీఐ కేసుల కారణంగానే జగన్ పట్ల బీజేపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్ర ఇచ్చే నిధులపై జగన్ భారీ ఆశలు పెట్టుకున్న వేళ.. బీజేపీ పెద్దల తీరు వైఎస్ఆర్సీపీకి ఓ రకంగా షాక్ అనే చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన కొత్తలో తాము చేసే పనులకు, తమకు మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఆ మాట బయటకు చెప్పలేని పరిస్థితి. కారణాలు ఏవైనా కావచ్చు కానీ.. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు అంతగా లేవనే భావన మాత్రం జనాల్లో కలుగుతోంది. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే.. పరిస్థితి ఇంకెంతగా మారుతుందో చూడాలి.