telugu navyamedia
సామాజిక

అమ్మా బడికేమైందే

అమ్మా బడికేమైందే

అమ్మా బడికేమైందే
నన్నింకా రమ్మని పిలవటం లేదు
రుతువులు పక్షుల్లా ఎగిరిపోయాయి
వేసవి సెలవులు వచ్చినట్టే తెలియదు
అవీ వెళ్లి పోయాయి
అయినా
బడి నన్ను రమ్మని పిలవటం లేదు
బడికేమైందమ్మా

జలుబు చేసిందా
జ్వరమొచ్చిందా
మరేదైనా మాయరోగమొచ్చిందా
మరెందుకని
తలుపులు తెరిచి
రారమ్మని పిలవటం లేదు
గంట గొంతెత్తి
అరిచి మరీ పిలవటం లేదు
అమ్మా బడికేమైంది

ఒకప్పుడు బడిలేదంటే
సంబరంగానే వుండేది
కానిపుడెందుకో
బడికెళ్లాలనిపిస్తోంది

నేను బడికెళ్లనని
మారాం చేసినపుడల్లా
అటెండరునో ఆయమ్మనో
ఇంటికి పంపించేది బడి
ఇపుడెవరినీ పంపించటం లేదు
కనీసం ఫోను ద్వారానైనా
సంప్రదించటం లేదు
నువ్వూ డాడీ కూడా
ఏమీ మాట్లాడటం లేదు
అమ్మా ఇంతకీ
బడికేమైందే

హరిత హారంలో
నేను నాటిన మొక్కలు
నాకంటే ఎత్తు పెరిగుంటాయి
బెంచీల మీద నేను చెక్కిన పేరు నిండా
దుమ్ము చేరిపోయుంటుంది
మా తరగతి చూరు సందులో
పక్షి గుడ్లు రెక్కలొచ్చి
ఎగిరిపోయుంటాయి

మా మాస్టారి బెత్తాన్ని
ఎవరైనా విరిచేసి
మూలన పడేసి పోయుంటారా

మా పేర్లు పిలిచే
హాజరు పట్టీలు
పాపం ఊపిరాడక
ఎక్కడ ముడుచుకున్నాయో

మా టీచరమ్మలు తయారు చేసిన
టియ్యెల్లెమ్ములు
ఎలుకలు కొట్టేసాయో
బూజు పట్టేశాయో
ఒకసారి చూసి రావాలనుందే

ఎప్పుడూ లేంది బడిలా
ఉలుకూ పలుకూ లేకుండా
పడుందేమిటమ్మా

గుడి తలుపులు తెరుచుకున్న చోట
బడి తలుపులకేమైందమ్మా
ఇంకా బిగదీసుకుని
కూర్చున్నాయి

పాపం బడిలో తన వొడిలో
మేం పడే బాధలు చూసి
బడికి జాలి కలిగిందా
మాతో చేయించే
బండెడు చాకిరీని చూడలేక
హఠాత్తుగా ప్రేమ పుట్టిందా
బడికేమైందమ్మా
మా వైపు కన్నెత్తి కూడా
చూడటం లేదు

బడికేమైందోనని
భయంగా వుందే
ఒకసారి బడికెళ్లి
పలకరించి వస్తానే

అమ్మా బడికేమైందమ్మా
గంట గంటకూ గంట గొంతెత్తి పిలిచే బడి నోరు
ఇంతగనం మూతపడిందేమిటి?
అమ్మా బడికేమైందే!

Related posts