ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన “మార్కెట్ లో ప్రజాస్వామ్యం” చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విజయయాత్రను విజయనగరంలోని సప్తగిరి థియేటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజల ఓట్లను నేతలు ఏ విధంగా కొంటున్నారన్న తీరును చూపించానని తెలిపారు.
అలాగే ఎన్నికలు ముగిశాక ఫిరాయింపులకు పాల్పడుతున్న తీరును తన చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించానని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గురించి ఆయన ప్రస్తావించారు. ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పడం గొప్ప విషయమన్నారు. ఆ విషయంలో సీఎం జగన్ ను అభినందిస్తున్నానని అన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరుపై విమర్శలు చేశారు.