telugu navyamedia
సినిమా వార్తలు

మూడు పార్టీలతో హీరో నిఖిల్ రాజకీయం

NIkhil

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కొంతమంది కొన్ని పార్టీలకు తమ మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది మాత్రం ఎవరికీ మద్దతు తెలపకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే హీరో నిఖిల్ మాత్రం ఏకంగా మూడు రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా నిఖిల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్నూలు జిల్లా వెళ్లి కేఈ ప్రతాప్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీంతో అతనిపై తెలుగుదేశం ముద్ర పడింది. కానీ నిఖిల్ మాత్రం దీనిని కొట్టిపారేస్తూ తాను తెలుగు దేశం వాడిని కానని, కేఈ ప్రతాప్ తనకు అంకుల్ అయినందున ప్రచారంలో పాల్గొన్నానని చెప్పాడు.

తరువాత జనసేనకు మద్దతుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జనసేన తరఫున విశాఖ నుండి పోటీ చేస్తున్న మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కలిసి మద్దతు ప్రకటించాడు. ఆ సమయంలో లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం చేస్తున్నారని, బాండ్ పేపర్ల మీద హామీలను రాసిస్తున్నారని, జనసేన తరపున చాలా సాధారణ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కూడా పోటీలో ఉన్నారని ఇది గొప్ప విషయం అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా తెరాస అభ్యర్థి సికింద్రాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీలో ఉన్న తలసాని సాయి యాదవ్‌కు మద్దతు పలికాడు. అంతేకాదు తలసాని సాయి యాదవ్ తనకు స్నేహితుడని ఆయన రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ నిఖిల్ మరో పోస్టు చేశాడు. నిఖిల్ ఇలా మూడు పార్టీలతో చేతులు కలిపి నిఖిల్ చేసిన రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related posts