telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

53 ఏళ్ళ నాడే ఎన్.టి.ఆర్. గారు నటించిన చిత్రం శతదినోత్సవ కార్యక్రమం చరిత్ర సృష్టించింది

వందలాది కార్ల కాన్వాయితో దాదాపు లక్ష మంది జనాభాతో ఊరేగింపు జరిపి 53 ఏళ్ళ నాడే ఎన్.టి.ఆర్. గారు నటించిన చిత్రం శతదినోత్సవ కార్యక్రమం చరిత్ర సృష్టించింది…

తెలుగు సినిమా స్వర్ణయుగంలో నటరత్న నందమూరి తారక రామారావు గారితో వరుసగా చిత్రాలు నిర్మించిన సంస్థలల్లో శ్రీ వెంకటేశ్వర స్వామీ ఫిల్మ్స్ (SVS) ఒకటి. 1957 లో ఎన్.టి. రామారావు గారు హీరోగా “రాజ నందిని” చిత్రాన్ని జలరుహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు విజయవాడ లక్ష్మీ టాకీస్ అధినేత మిద్దే జగన్నాథరావు గారు.ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే రామారావు గారికి సన్నిహితులు కావడంతో యస్.వి.యస్. ఫిల్మ్స్ సంస్థ ను ప్రారంభించి “నిండు మనసులు”, “కలిసొచ్చిన అదృష్టం” చిత్రాలను నిర్మించారు నిర్మాత మిద్దే జగన్నాథరావు గారు. ఆ సంస్థ ఎన్.టి. రామారావు గారి తో నిర్మించిన మూడవ చిత్రం “నిండు హృదయాలు”. ఈ చిత్రంలో శోభన్ బాబు, చలం కూడా కీలక పాత్ర పోషించారు.రామారావు గారి సరసన హీరోయిన్ గా వాణిశ్రీ నటించడం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. ఒకటి రెండు మూడు సంఖ్యలు విడి విడిగా ఉంటే అంతే కానీ వాటిని కలిపి చదివితే నూట ఇరవై మూడు ఐకమత్యమే బలం అనే సందేశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.

1969 ఆగస్ట్ 15 న నిండు హృదయాలు చిత్రం విడుదలైంది. మంచి కథ, ఆసక్తికరమైన అంశాలను కలిగిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అదే ఏడాది నవంబర్ 23 న విజయవాడ లోని జెై హింద్ టాకీస్ లో చిత్ర శతదినోత్సవం జరిగింది. ఎన్.టి. రామారావు గారు, వాణిశ్రీ,చంద్రకళ, సత్యనారాయణ, రేలంగి, అల్లు రామలింగయ్య, దర్శకుడు విశ్వనాథ్ తదితరులు ఈ శత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ శతదినోత్సవ కార్యక్రమానికి ముందు దాదాపు లక్ష మంది అభిమానులు, ప్రజలతో పెద్ద ఊరేగింపుగా ఎన్.టి. రామారావు గారు, సావిత్రి, వాణిశ్రీ తదితరులను థియేటర్ వరకు తీసుకొని వచ్చారు.

నటీమణి సావిత్రి గారు ఈ చిత్రంలో నటించక పోయినప్పటికి ముఖ్య ఆధితి గా బహుమతి ప్రదానం చెయ్యడం కోసం ప్రత్యేకంగా చెన్నై నుండి విచ్చేశారు. ఈ సందర్భంగా రామారావు గారు మాట్లాడుతూ డబ్బు సంపాదించాలనే కోరిక నాకు లేదు, సేవా ధర్మంతో కళకూ పరమార్ధం చేకూర్చలనే ఆశ ఉంది. 22 ఏళ్ళ సుదీర్ఘ కృషి వల్లన 200 చిత్రాలలో నటించాను. ప్రతివారి హృదయంలో స్థానం సంపాదించుకోవాలనే కోరిక వుంది. నన్ను భగవంతునిగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. వారి రుణం తీర్చుకోలేనిది, ఈ విజయవాడ పట్టణంతోనే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడి నుండి మద్రాసు వెళ్ళాను. మీ అందరి దీవేనలతో పేరు తెచ్చుకోగలిగాను అన్నారు.

మహానటి సావిత్రి మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించలేకపోయినప్పటికీ ఇందులో నటించిన వారందరికీ నా చేతుల మీదుగా జ్ఞాపికలు అందించడం ఆనందం గా ఉంది. ముఖ్యంగా రామారావు గారు తన మాటలతో, తన చేతలతో మమ్మల్ని అభివృద్ధిలోకి తెస్తున్నారు అన్నారు. జైహింద్ టాకీస్ తరుపున జాస్తి నారాయణ రావు నటీనటులకు స్వాగతం పలికి వారిని సభికులకుా పరిచయం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ పిక్చర్స్ (ఎస్.వి.ఎస్) తరుపున నిర్మాత మిద్దే జగన్నాధరావు నటీ, నటులకూ, సాంకేతిక నిపుణులకూ వెండి ప్రతిమలు (మేమొంటో) లను బహుకరించారు..

Related posts