స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్ ఇటీవల మళ్లీ ఆటలోకి పునరాగమనం చేశాడు. అతడిపై బీసీసీఐ విధించిన నిషేధం పూర్తికావడంతో ప్రస్తుతం దేశవాళీ మ్యాచ్‌లలో ఆడుతున్నాడు. కేరళకు చెందిన ఈ కుడిచేతి వాటం పేసర్ ఒక దశలో టీమ్ ఇండియాలో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. కానీ కెరీర్‌లో ఎదుర్కొన్న వివాదాలతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. తాను ఏతప్పూ చేయలేదని, మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెడతానని శ్రీశాంత్ ముందు నుంచి చెబుతున్నాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్నాడు. రానున్న 2021 ఐపీఎల్ సీజన్‌లో తనను ఏదో ఒక జట్టు వేలంలో తీసుకుంటుందని అతడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలిగే శ్రీశాంత్ క్రికెట్‌లో మళ్లీ సత్తా చాటేందుకు ఒక అవకాశం కోసం వేచిచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌ను వేలంలో తీసుకునేందుకు మూడు జట్లు ఆసక్తి చూపించవచ్చు. శ్రీశాంత్‌ను తీసుకునే అవకాశం ఉన్న మొదటి టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ టీమ్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. నాణ్యమైన పేస్ బౌలింగ్ లేకపోవడంతో కింగ్స్ ఎలెవన్ విజయాలకు దూరమవుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బ్యాంటింగ్ విభాగంలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడంవల్ల మ్యాచ్‌లు గెలవలేకపోతున్నామని టీమ్ మేనేజ్‌మెంట్ కూడా గుర్తించింది. దీంతో శ్రీశాంత్ వంటి అనుభవం ఉన్న బౌలర్‌ను తీసుకుంటే తమకు ఉపయోగపడవచ్చని ఆ జట్టు భావిస్తోంది. దీనికి తోడు గతంలో పంజాబ్ తరఫున అతడు ఆడటం, మెరుగైన ప్రదర్శన చేయడం కూడా కలిసివచ్చే అంశం.
గత ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ పేలవమైన ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టీమ్‌లో పేరున్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయారు. 2021 సీజన్‌కు ముందు వరుణ్ ఆరోన్‌ను మేనేజ్‌మెంట్ వదులుకుంది. దీంతో ఈ ఒక ఇండియన్ పేసర్‌కు జట్టులో స్థానం ఉంది. ఐపీఎల్‌లో మంచి అనుభవంతో పాటు పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న శ్రీశాంత్‌ను తీసుకుంటే, బౌలింగ్ విభాగం బలపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీనికి తోడు ఫిక్సింగ్ కుంభకోణం బయపడినప్పుడు అతడు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ సీజన్‌లో అతడు రాయల్స్ జట్టులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, గత సీజన్లో చెత్త ఆటతో గేమ్ నుంచి నిష్క్రమించింది. దీంతో 2021 సీజన్‌కోసం జట్టులో భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీనియన్ ప్లేయర్లు చాలామందిని చెన్నై వదులుకుంది. గతంలో ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీశాంత్ టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. కెప్టెన్ అంచనాలకు అందుకోవడంలో అతడు ఎప్పుడూ విఫలం కాలేదు. దీంతో అంచనాలకు అనుగుణంగా ప్రభావం చూపే సామర్థ్యం ఉన్న శ్రీశాంత్‌పై ధోనీ దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. కొత్త జట్టుతో ఈ సీజన్ ఆడాలనుకుంటున్న చెన్నై, అతడిని వేలంలో తీసుకోవచ్చు. టీమ్‌లో ప్రధాన బౌలర్లుగా ఉన్న చాహర్, ఠాకూర్‌లలో ఎవరైనా గాయపడితే బ్యాకప్ ప్లేయర్‌గానూ శ్రీశాంత్‌ను బరిలోకి దింపవచ్చు.