ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీలో కూడా కొత్త తరహా పద్ధతులు కనిపెడుతున్నాయి ఆయా పార్టీలు. ఏదో ఒక పధకం పేరు చెప్పి ఓటరు ఖాతాలలో నగదు జమ అవుతున్న సంగతులు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతోంది. వందలకొద్దీ ఖాతాల్లో పదేసివేల చొప్పున డబ్బు డిపాజిట్ అవుతోంది. ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చిపడుతున్నాయో తెలుసుకునేందుకు ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలోనే, మొరాదాబాద్ జిల్లాలోని 1700 జన్‌ధన్ ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.1.7 కోట్లు ఆయా ఖాతాల్లో జమ అయింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులే ఈ సొమ్మును జమ చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.