ప్రపంచ అథ్లెటిక్స్ మెగా సంబరాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఖతార్‌లోని దోహాలో ప్రారంభమయ్యే క్రీడా సంరంభంలో 209 దేశాలు..దాదాపు 2 వేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. భారత్ కూడా క్రీడాకారులను రంగంలోకి దింపింది. గత ప్రదర్శనల కన్నా మెరుగ్గా రాణించేందుకు సిద్ధం అయ్యింది. గత 16 టోర్నీలలో భారత్ ప్రదర్శన అంతంతమాత్రమే. 2003 సంవత్సరంలో అంజూ బాబీ జార్జీ కాంస్యం పతకం గెలిచిన తర్వాత..ఎలాంటి పతకాలను భారత క్రీడాకారులు సాధించలేకపోయారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ 27 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. వీరిలో 16 మంది పురుషులు ఉండగా..11 మంది మహిళలున్నారు. అమెరికా అత్యధికంగా 159 మంది అథ్లెట్లను బరిలోకి దింపుతోంది. ఇందులో సత్తా చాటేందుకు రిలే జట్లు సన్నద్దమయ్యాయి. పురుషుల, మహిళల విభాగాలతో పాటు మిక్స్‌డ్ విభాగాలతో పాటు రిలే బృందాలు బరిలో ఉన్నాయి. పతకాలపై దృష్టి పెట్టకుండా..ఒలింపిక్స్ బెర్తు, జాతీయ రికార్డులు మెరుగుపరుచుకోవడంపైనే భారత్ జట్లు దృష్టి సారించాయి. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తొలిసారి జరుగుతున్న మిక్స్‌డ్ రిలేలోనూ మెరుగైన ప్రదర్శన చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.
పతకాలు తేగల సత్తా ఉన్నా..క్రీడాకారులు గాయాలబాట పట్టారు. నీరజ్ చోప్రా..గాయంతో తప్పుకోగా..హిమదాస్ కూడా అదే బాట పట్టారు. హిమదాస్ ఐరోపా మీట్స్‌లో 6 స్వర్ణాలు గెలిచాడు. దోహాకు వెళుతున్న 27 మందిలో పురుషులు : జబీర్, ధరుణ్, అయ్యస్వామి జిన్సన్ జాన్సన్, అవినాశ్ సబేల్, ఇర్ఫాన్, దేవేందర్ సింగ్, తొనాకల్ గోపి, శ్రీ శంకర్, తేజిందర్ పాల్ తూర్, శివ్ పాల్ సింగ్, మహ్మద్ అనాస్, నిర్మల్ నాచ్, అలెక్ అంథోని, అమోజ్ జాకబ్, జీవన్, ధరుణ్ అయ్యస్వామి, హర్ష్ కుమార్; మహిళలు : ద్యుతి చంద్, పి.యు.చిత్ర, అంజలిదేవి, అర్చన సుశీంద్రన్, అన్నురాణి, విస్మయ, పూవమ్మ, జిస్నా మాథ్యూ, రేవతి, శుభ, విత్య ఉన్నారు. వ్యక్తిగత విభాగంలో ద్యుతిచంద్, శ్రీ శంకర్‌లపైనే ఆశలు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ద్యుతికి ఇదే అవకాశం అంటున్నారు క్రీడా విశ్లేషకులు. మంచి ప్రదర్శనలు చేస్తున్న జిన్సన్ జాన్సన్, తేజిందర్ సింగ్ తూర్, ధరుణ్ అయ్యస్వామిలపై కూడా అంచనాలున్నాయి.