తెలంగాణలోని ఈ.ఎస్.ఐ లో అవినీతి అక్రమాలు జరగటం పై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పేద కార్మికుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ముతో ఆర్థిక నేరాలకు పాల్పడిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వీరందరిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ.ఎస్.ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన షేక్‌పేటకు వచ్చిన ఏసీబీ అధికారులు…ఆమె నివాసంలో అరెస్టు చేసి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 2018 నవంబర్ 3న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది. దీన్ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా వివరాలు సేకరించే పనిలో ఉండగా… ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిపై అనేక ఆరోపణలు ఉన్నట్టుగా ఈడీకి తెలిసింది.
దేవికారాణికి అనేక బినామి కంపెనీలున్నాయని… మందుల కొనుగోళ్లలో వందల కోట్ల కుంభకోణం చేసినట్లు సమాచారం అందింది. అంతేకాకుండా మందులు సప్లై చేయకుండానే దాదాపుగా 200 కోట్లకు బిల్లులు సృష్టించారంటూ ఫిర్యాదుదారుడు తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విచారణ చేపట్టింది. 23మంది ఇళ్లలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 24 గంటలపాటు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. 10 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్టుగా పత్రాలతో సహా ఏసీబీ ఆధారాలు సేకరించింది. మరోవైపు 100 కోట్ల మేర అవినీతి జరిగినట్టుగా అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందినట్టు తెలుస్తోంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా… తవ్వుతున్న కొద్దీ మందుల కొనుగోళ్లలో అవినీతి బయటపడుతోంది.