telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘అన్నగారి విగ్రహంలో మీ భాగస్వామ్యం కావాలి’ – టి .డి . జనార్దన్

నందమూరి ఎన్.టి. రామారావు కీర్తి ఆ చంద్రతారార్కం ఉండాలనే సంకల్పతోనే మా కమిటీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను తలపెట్టిందని, ఎన్ .టి .ఆర్ ప్రసంగాలను రెండు సంపుటాలుగా , అన్నగారి వ్యక్తిత్వం పై శకపురుషుడు అన్న ప్రత్యేక సంచికను వెలువరించామని టి .డి .జనార్దన్ తెలిపారు.


ఎన్ .టి .ఆర్ .శతాబ్ది వేడుకలను లాస్ ఏంజిల్స్ లో అభిమానులు ఏర్పాటుచేశారు . ఎన్ .టి .ఆర్.సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి. జనార్దన్ మాట్లాడుతూ , ఇప్పటివరకు ఎంతో మంది శతాబ్ది ఉత్సవాలు జరిగాయి , కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఘనంగా ఎవరికీ జరగలేదని చెప్పవచ్చు . ఆ క్రెడిట్ అన్నగారికి మాత్రమే దక్కినదని జనార్దన్ చెప్పారు .


ఎన్ .టి .ఆర్ . సినిమా జీవిత తొలి రోజుల్లోనే ప్రజల కష్టాలు , కన్నీళ్లు తుడిచారని, ప్రజా సేవే పరమార్ధంగా భావించారని , ఆసేవా గుణమే అన్నగారిని రాజకీయాల్లోనకి వచ్చేలా చేసిందని జనార్దన్ తెలిపారు .
ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం ప్రజల కోసమే శ్రమించారని , ఆయన కుటుంబం కన్నా ప్రజలే మిన్నగా భావించిన మానవాతావాదని ఆయన అన్నారు. హైద్రాబాద్ లో అన్నగారి 100 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలనే ఉద్దేశ్యంతోనే అమెరికా వచ్చానని , ఆ మహత్ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని జనార్దన్ పిలుపునిచ్చారు .


ఎన్ .టి .ఆర్ .శతాబ్ది వేడుకల్లో భాగంగా లాస్ ఏంజిల్ లో వున్న తెలుగు బాల బాలికలు ప్రదర్శించిన నృత్యాలు ఎంతో బాగున్నాయని , తెలుగు సంస్కృతీ , సంప్రదాయాలు మర్చిపోకుండా మీ పిల్లలకు వాటి ప్రాముఖ్యం తెలియజేయడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలుగు కుటుంబాలను జనార్దన్ అభినందించారు .
ఎన్ .టి .ఆర్ . శతాబ్ది వేడుకలకు తెలుగు కుటుంబాలు తరలి వచ్చాయి . వెయ్యి మంది సామర్ధ్యం వున్న ఆడిటోరియం లో 1350 మంది రావడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
కార్యక్రమానికి ముందు శరత్ కామినేని ఇంట్లో కొలువైన అన్నగారి విగ్రహాన్ని దర్శించిన జనార్దన్ , అట్లూరి అశ్విన్, పుష్ప గుచ్ఛాలను ఉంచి నివాళులు అర్పించారు .

Related posts