telugu navyamedia
క్రీడలు వార్తలు

రంజాన్ దీక్షను పాటిస్తున్న కేన్, డేవిడ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు.. రంజాన్ ఉపవాస దీక్షను పాటిస్తున్నారు. తోటి ముస్లిం ఆటగాళ్లతో కలిసి కఠోర దీక్షను అనుసరిస్తున్నారు. హైదరాబాద్‌ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఆడుతున్న వారిలో ముస్లిం క్రికెటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన టాప్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సహా ఖలీల్ అహ్మద్, ముజీబుర్ రెహ్మాన్, షాబాజ్ నదీం, మహ్మద్ నబీ, అబ్దుల్ సమద్.. వారంతా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఆటగాళ్లే. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా ఉపవాస దీక్షను పాటిస్తున్నారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం.. తెల్లవారు జామునే వారి దీక్ష ఆరంభమౌతోంది. సాయంత్రం ప్రత్యేక ప్రార్థనల అనంతరం దీక్షను విరమిస్తున్నారు. రంజాన్ ఉపవాస దీక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలిసిన విషయమే. మంచినీటిని కూడా స్వీకరించారు. ఉమ్మిని కూడా మింగరు. ఉపవాసాన్ని విరమించిన తరువాతే.. ఆహారాన్ని తీసుకుంటారు. ఐపీఎల్ వంటి పవర్‌ఫుల్ క్రికెట్ టోర్నమెంట్‌ ఆడుతున్న సమయంలోనూ ఆ ప్లేయర్లందరూ ఉపవాస దీక్షను యధాతథంగా అనుసరిస్తున్నారు. దాన్ని చూసి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్, స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తోంది. తోటి క్రికెటర్లతో పాటు వారు కూడా రంజాన్ దీక్షను పాటిస్తున్నారు. వారితో కలిసి దీక్షను విరమిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్పింగ్‌ను రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Related posts