telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణాలో .. ఘోరంగా తగ్గిన ఓటింగ్ శాతం..

MLC nominations file date end today

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన లోక్ సభ పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని 17 లోక్‌సభ సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికల్లో భారీ కోత పడింది. 2014 నాటి ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పోలింగ్ శాతం బాగా తగ్గడం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. వివిధ పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 5 నుంచి 16 శాతం మేర పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం విస్మయం కలిగిస్తోంది. 2019లో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 62.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికలప్పుడు 70.75 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 8.50 శాతం ఈసారి ఓటింగ్ తగ్గింది. ఈ లెక్కన లక్షలాది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.

17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను అత్యధికంగా ఖమ్మంలో 75.61 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్ లో 39.49 మేర ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరి సెగ్మెంట్ లో 42.75.. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో 45 శాతం ఓటింగ్ నమోదైంది. 17 లోక్‌సభ స్థానాలకు గాను హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగరం పరిధిలో ఉన్నాయి. మిగతా 14 స్థానాల్లో 50 శాతానికి మించి పోలింగ్ నమోదైతే.. నగరంలోని ఈ మూడు నియోజకవర్గంలో 50 శాతం లోపు మాత్రమే ఓట్లు పోల్ కావడం గమనార్హం.

నగర పరిధిలోని 3 సెగ్మెంట్లలో అతి తక్కువ పోలింగ్ నమోదు కావడానికి కారణాలు అనేకం. ఈ మూడు నియోజకవర్గాల్లో చూసినట్లయితే దాదాపు 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో నివసిస్తున్నవారు కొందరుండగా.. ఏపీకి చెందిన మరికొందరు ఉన్నారు. అయితే దాదాపు 10-15 లక్షల మందికి వారి స్వంత ఊళ్లల్లో కూడా ఓట్లు ఉన్నాయి. అంతేకాదు కొందరేమో సెలవు ఉన్నప్పటికీ ఓటు వేయడానికి బయటకు రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈసారి నిజామాబాద్ ఎన్నికలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు బరిలో నిలిచారు. దానితో పోటీ రసవత్తరంగా మారింది. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని.. బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించలేదని ఆమెపై ఆరోపణలున్నాయి. అయితే నిజామాబాద్ లో తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. 2014లో 68.61 శాతం పోలింగ్ నమోదైతే.. ఈసారి 54.20 శాతం ఓట్లు పోల్ కావడం గమనార్హం. 14.41 శాతం ఓటింగ్ తగ్గడంతో అభ్యర్థులు ఎవరు గెలిచినా.. మెజార్టీ అత్యంత స్వల్పంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అసలు గెలుపోటములు తారుమారైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా 2014, 2019 పోలింగ్ శాతం వివరాలు :

సెగ్మెంట్ : 2014 – 2019

ఖమ్మం : 81.88 – 75.61 
భువనగిరి : 80.99 – 75.11
నల్గొండ : 79.01 – 74.12
ఆదిలాబాద్ : 75.31 – 71.98
మెదక్ : 77.34 – 71.56
కరీంనగర్ : 72.23 – 69.40
జహీరాబాద్ : 75.61 – 67.80
మహబూబ్ నగర్ : 71.14 – 65.30
పెద్దపల్లి : 71.68 – 65.22
మహబూబాబాద్ : 80.79 – 64.46
నాగర్ కర్నూల్ : 74.92 – 62.51
వరంగల్ : 76.13 – 60.00
నిజామాబాద్ : 68.61 – 54.20
చేవెళ్ల : 60.05 – 53.80
సికింద్రాబాద్ : 53.02 – 45.00
మల్కాజిగిరి : 50.85 – 42.75
హైదరాబాద్ : 53.27 – 39.49

Related posts