ఏపీ సీఎంగా మరో సారి ప్రమాణ స్వీకారం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మే 23వ తేదీ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం అమరావతిలో మీడీయాతో ఆయన మాట్లాడుతూ ఓటేసేందుకు ఏపీ ప్రజలు సుదూర ప్రాంతాల నుండి రాష్ట్రానికి వచ్చారని ఆయన చెప్పారు. పోలింగ్ రోజున సైలెంట్ వేవ్ కన్పించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్‌కు వ్యతిరేకంగా ఓటర్లు తమ తీర్పును ఇచ్చారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తనపై నమ్మకం ఉంచి ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈవీఎంలు పని చేయకున్నా.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నా కూడ తమ ఓటు వినియోగించుకొనేందుకు ప్రజలంతా ఓపికగా ఉన్నారని బాబు గుర్తు చేశారు. ఈసీ ఎన్నికల నిర్వహణలో విఫలమైతే వైసీపీ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.ఎన్నికల నిర్వహణలో ఈసీ అనుసరించిన విధానం సరిగా లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.