నేడు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. గత అర్థరాత్రి నుంచే నగరంలోకి అంతర్రాష్ట్ర, జిల్లాల లారీలకు అనుమతి నిలిపివేశారు.
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలలోగా మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ తెలిపింది.
నిమజ్జనం కోసం భక్తులు ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌లో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ప్రతి ఏడాది హైదరాబాద్‌లో ఉండే సందడి కాస్త తగ్గింది. గణనాథుడి ఉత్సవాలు నిరాడంబరంగా సాగిన నేపథ్యంలో నిమజ్జనంలో కూడా గతంలోలా పెద్దగా హడావుడి కనబడడం లేదు. ఈ సారి కరోనా నేపథ్యంలో చిన్న గణేశ ప్రతిమలనే ప్రతిష్టించారు.