telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాల “బాపు”

తెలుగు సినీ పరిశ్రమలో కుంచెతో బొమ్మలు వేసి.. వాటి ఆధారంగా అద్భుతమైన చిత్రాలు తీసి.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు బాపు. నేడు సత్తిరాజు లక్ష్మీనారాయణ అలియాస్ బాపు వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం (15 డిసెంబర్ 1933 – 31 ఆగస్టు 2014)

చిత్రకారులెవరైనా కుంచెతో బొమ్మలు వేస్తారు. కానీ ఆయన అదే కుంచెతో వెండితెరపై బొమ్మలు గీశారు. ఆ బొమ్మలన్నీ కదిలి ఒయ్యారాలు పోయి, గిలిగింతలు పెట్టి ప్రేక్షకుల గుండెల్లో అపురూప చిత్రాలుగా కొలువుండిపోయాయి. అందుకే ఆయన చలన ‘చిత్ర’కారుడు! సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే బాపు గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఓ పుస్తకమైనా సరిపోదు. అభిమానుల మాటల్లో చెప్పాలంటే… ‘ఆయన ఓ గొప్ప దర్శకుడు’ అంతే.

ఒకసారి ఓ పుస్తకానికి శ్రీవెంకటేశ్వరస్వామి పాదాలు వేశారు బాపు. గ్రంథకర్త కాస్త చనువు తీసుకుని ‘అయ్యా స్వామి వారి కాలి వ్రేళ్లు కాస్త ఉబ్బెత్తుగా వున్నాయి’ అంటూ తల గోక్కున్నాడు. ‘దానిదేముండీ… బూట్లు తొడుగుదాంలే’ అన్నారు బాపు కూల్‌గా. అవతల నుంచి మాట లేదు! దటీజ్‌ బాపు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా బాపు జ్ఞాపకాలు కొన్ని మీకోసం.

అభిమానుల దృష్టిలో బాపు… ‘భలే బొమ్మలేస్తాడు! భలేగా బొమ్మలు తీస్తాడు’ అంతే. ఆ అభిమానమే ఆయనకు అన్ని పురస్కారాల కన్నా ఎక్కువ. అంతకన్నా బాపు గురించి ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే ఆయన వేసిన బొమ్మలు, తీసిన బొమ్మలు అంతకంటే చాలా ఎక్కువే చెబుతాయి.

అందమైన అమ్మాయికి మారుపేరు ‘బాపు బొమ్మ’. బాపు రమణతో కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ… వీరంతా గుర్తుకు వస్తే మనసు ఎంతగా నవ్వుకుంటుందో!! ఆరుద్ర అందుకే అన్నారు… ‘కొంటె బొమ్మల బాపు, కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు, ఓ కూనలమ్మా’ అని. సృష్టిలో తీయనిది స్నేహమే అంటే స్నేహం మధురమైనదని అర్థం…అంతేకాని తీయలేక పోయినదని మాత్రం కాదని భాష్యం చెప్పిన ముళ్ళపూడి వెంకట రమణ ఆయన చెలికాడు. బాపు-రమణలవి అవిభాజ్య శరీరాలు. ఒకరిది లేఖాచిత్రమైతే, మరొకరిది రేఖాచిత్రం. రెండూ కలిస్తే మనోహర చిత్రం… అదే చలనచిత్రం.

‘హై నూన్’ స్ఫూర్తితో
50వ దశకంలో బాపు రమణతో కలిసి రోజూ సినిమాలు చూసేవారు. సినిమా అయిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మైళ్ల కొద్దీ నడుస్తూ ఇల్లు చేరేలోగా ఆ సినిమాల్లో ఎన్ని తప్పులునాయో వెదికేవాళ్ళు. ‘మనమే సినిమా తీస్తే’ అనే ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలకు కథలల్లి, బొమ్మలతో స్కీన్ర్‌ ప్లే రాసేవాళ్ళు. 1952లో ‘హై నూన్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా వచ్చింది. ఆ చిత్ర ప్రభావంతో రమణ.. 1959 ప్రాంతంలో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు. ‘హై నూన్‌’ సినిమాలో కౌబాయ్‌ పాత్రను బల్లకట్టు కిష్టప్పగా మార్చి ఆ కథనే మరికొన్ని మార్పులతో సినిమాగా తీస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలెట్టారు.

Bapu

కృష్ణ, విజయనిర్మల, జగ్గారావు, విజయలలిత, రాజబాబు, రామన్న పంతులు ప్రధాన తారాగణమని, మహదేవన్‌ సంగీత దర్శకుడని, రెండులక్షలు పెట్టుబడి పెడితే యాభైవేలు తమవంతుగా వేసుకొని సినిమా తీస్తామని “నవయుగ” శ్రీనివాసరావుకు చెప్పారు. పాతికరోజుల్లో ఒకటే షెడ్యూలుతో పూర్తి అవుట్‌ డోర్‌లో సినిమా నిర్మాణం పూర్తి చేస్తామంటే శ్రీనివాసరావుకు నమ్మశక్యంలేదు. కానీ వీరు కృష్ణార్జునులు కదా. వారికి సాధ్యం కానిదంటూ ఉండదు. సమాజంలో వేళ్లూనిన అరాచకాలను, అన్యాయాలను అణచివేసే నేపథ్యంతో గ్రామీణ వాతావరణంలో సినిమా నిర్మాణం చేపట్టాలని ‘సాక్షి’ సినిమా కోసం ప్రణాళికా రచన చేసి పాతిక రోజుల్లో తొలి కాపీ తీసుకొచ్చి తమ సత్తాను చాటారు. అలా ‘సాక్షి’ నామ సంవత్సరానికి బాపు రమణలు బాటలు వేశారు. అలా గంటన్నరలో జరిగే ఒక కథను సినిమాగా తీస్తే ఎలాఉంటుందో తెలుగు ప్రేక్షకులకు చూపాలని బాపు చేసిన ప్రయోగమే ‘సాక్షి’.

యస్.. ఇది బాపు సినిమా..
1969లో బాపు-రమణలు భారీ తారాగణంతో ‘బుద్ధిమంతుడు’ సినిమా తీశారు. 1952లో వచ్చిన ‘ద లిటిల్‌ వరల్డ్‌ ఆఫ్‌ డాన్‌ కేమిల్లో’ అనే ఇటాలియన్‌ సినిమా ఆధారంగా రమణ మలిచిన కథ ఈ సినిమాకు ఆధారం. రమణ మలిచిన కథలో సద్బాహ్మ్రణ వంశంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములలో పెద్దవాడు వేణుగోపాల స్వామి ఆలయ పూజారి, పరమ ఆస్తికుడు. తమ్ముడు ఆధునిక భావాలతో మానవసేవే మాధవ సేవగా భావించే నాస్తికుడు. కథ చాలా బాగా కుదిరింది. అది విన్నాక అక్కినేని రెండు పాత్రల్నీ తనే వేస్తానన్నారు. ఇందులో పూజారి పాత్ర విప్రనారాయణను తలపించేదిలా ఉంటుంది. అక్కినేని నటిస్తున్నారని తెలిసి రమణకు భానుమతి కబురంపింది. కథ విని మైమరచి తనుకూడా అందులో నటిస్తానంది. నిజానికి తమ్ముని పాత్రకే హీరోయిన్, పూజారి పాత్రకు హీరోయిన్‌ లేదు. విజయనిర్మలను అక్కినేనికి జంటగా అనుకున్నారు బాపు-రమణలిద్దరూ.

Bapu

అదే విషయాన్ని భానుమతికి చెబితే, ఏదో ఒక చిన్న వేషమైనా ఇమ్మంది. అందులో గుమ్మడి నటించిన స్కూల్ ఇన్​స్పెక్టర్‌ వేషాన్ని ఆఫర్‌ చేశారు రమణ. సినేరియో త్వరగా రాసుకు రమ్మంది. మూడ్రోజుల తర్వాత భానుమతి భర్త ఇంటినుంచి కబురొచ్చింది రమణకు. ‘ఈ సినిమాలో పాటలెన్ని’ అని అడిగింది భానుమతి. ‘ఎనిమిది’ అని చెప్పారు రమణ. అందులో తనకెన్నని అడిగితే, ‘నిల్’ అని సమాధానమిచ్చారు రమణ. ‘కనీసం స్కూలు పిల్లలని ఉత్సాహపరుస్తూ పాడేలా ఒక పాటైనా పెట్టండి’ అని భానుమతి అడిగింది. అంతా ఫిక్సయిపోయింది, కుదరదని రమణ చెప్పారు. ఆ మాటకు భానుమతి కోపంతో ఊగిపోతూ ‘షూటింగు చేయకుండానే అంతా ఫిక్సై పోయిందా, ఇదేమన్నా కె.వి. రెడ్డిగారి సినిమానా’ అంటూ దెప్పిపొడిచింది. అందుకు సమాధానంగా ‘ఇది బాపు గారి సినిమా’ అని కూల్‌గా చెప్పి బయటికొచ్చేశారు. ఈ ఒక్క సంఘటన చాలు బాపు గొప్పతనం చెప్పడానికి.

తెరమీద రంగుల కలబోత
కుంచేతోనే కాదు సెల్యులాయిడ్‌ మీద రంగులు ముంచి అందాలను ఆవిష్కరింపజేసిన బాపు సంచిలో ఎన్ని ఆణిముత్యాలున్నాయో లెక్క పెట్టడం అసాధ్యం. 1976లో పింజల సుబ్బారావు బాపుతో తీసిన ‘సీతా కల్యాణం’ ఓ కళాఖండం, ఒక గొప్ప సంగీత రూపకం. రవికాంత్‌ నగాయిచ్‌ చేత గంగావతరణం చిత్రీకరణ చేసిన విధానం ఆశ్చర్యం.. అద్భుతం. లండన్‌ ఫిల్మ్​ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శనకు నోచుకుంది. 1976లోనే మరొక కళాఖండం ప్రదర్శనకు నోచుకుంది. అదే సూర్యనారాయణ రాజు నిర్మించిన ‘భక్త కన్నప్ప’. షూటింగు సింహభాగం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం పరిసరాల్లో జరిపారు. 30 అడుగుల ఎత్తు అమ్మవారి విగ్రహాన్ని మద్రాసు నుంచి వేలుస్వామిని పిలిపించి ఎరేనా సెట్‌లో ప్రతిష్టించారు. ఎదురుగా కోయదొర స్థావరాన్ని కట్టించారు. వాణిశ్రీ బాపుతో పని చెయ్యడం మొదటిసారి. కిరాతార్జునీయ చిత్రీకరణ, వేటూరి కలం బలానికి పదునుపెట్టింది.

భారత కథను సోషలైజ్‌ చేసి జయకృష్ణ నిర్మాతగా బాపు నిర్మించిన ‘మనవూరి పాండవులు’ మరో కొత్త కోణాన్ని చూపించింది. కృష్ణంరాజు పాత్ర గొప్పగా అమరింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఈ సినిమాలో ప్రేమగీతాల వంటి మసాలాలు లేకపోయినా బాగా ఆడింది. అంతేకాదు చిరంజీవి, భానుచందర్‌ వంటి వర్ధమాన నటుల ఎదుగుదలకు సోపానమైంది. ఇక ‘గోరంత దీపం’ విషయానికొస్తే, వాణిశ్రీ మేకప్‌ లేకుండా నటించటం బాపు గొప్పతనం. బాపుకు గజల్స్‌ అంటే ఇష్టం. నిమిషం లోపు వ్యవధి వుండే కవితల్ని గజల్స్‌గా మలిచి పి.బి.శ్రీనివాస్‌ తియ్యనిగొంతులో వినిపింపజేసిన ఘనత బాపూదే.

Bapu

బాపు గీసిన చిత్రం
రాజమండ్రి పరిసరాల్లోనే తీసిన మరో చిత్రం ‘తూర్పు వెళ్ళే రైలు’లో బాలు చేత సంగీత దర్శకత్వం నిర్వహింపజేసారు. పాటలన్నీ అద్భుతంగా వుంటాయి. మధ్యలో మరికొన్ని బాపు సినిమాలు వచ్చినా, ‘పెళ్లిపుస్తకం’ సినిమా వచ్చి బాపు పనితనాన్ని మరోసారి ఎలుగెత్తి చూపింది. అందులో ఆరుద్ర రాసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట వినిపించని పెళ్లి పందిరి ఉంటుందంటే సందేహమే! విజయావారి ‘మిస్సమ్మ’ సినిమా కథను తిరగేసిరాసిన సినిమా ‘పెళ్లి పుస్తకం’. 1991లో బాపు ‘మిస్టర్‌ పెళ్లాం’ తీశారు. ఉత్తమ చిత్రంగా నంది బహుమతి వచ్చింది. పిల్లల కోసం వీడియో పాఠాలు రూపొందించారు ఇద్దరూ. అందుకే బాపును గురించి రాయాలంటే రమణ గురించి చెప్పాల్సి వుంటుంది. రమణ గురించి రాయాలంటే బాపు ప్రస్తావన లేకుండా అది అసమగ్ర రచన అవుతుంది.

Related posts