telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనా కారణంగా వేద కృష్ణమూర్తి ఇంట మరో విషాదం…

భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో పెను విషాదం నెలకొంది. కొరోనా మహమ్మారి కారణంగా వేద సోదరి వత్సల శివకుమార్ మృతి చెందారు. గత నెల వేద సోదరికి కరోనా సోకగా.. ఈరోజు ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద కృష్ణమూర్తి మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపారు. రెండు వారాల క్రితమే వేద తల్లి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకే సమయంలో తల్లి, సోదరి కన్నుమూయడంతో 28 ఏళ్ల వేద కృష్ణమూర్తి కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబ్డా దేవి గత నెల 25న తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన చెలువాంబ్డా దేవి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే అవేమీ సఫలం కాలేదు. చివరకు దేవి కోవిడ్19తో కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద కృష్ణమూర్తి తన సోషల్ మీడియా ఖాతాల్లో స్వయంగా పోస్ట్ చేశారు. ఆ సమయంలోనే కరోనా బారిన వత్సల శివకుమార్ 10 రోజుల తర్వాత కన్నుమూశారు. వేద కృష్ణమూర్తి భారత జాతీయ జట్టుకు 48 వన్డేలు, 76 టీ20 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించారు. వన్డేల్లో 829 పరుగులు.. చేయగా అత్యధిక స్కోర్ 71. టీ20ల్లో 875 రన్స్ చేయగా.. టాప్ స్కోర్ 57 నాటౌట్. రెండు ఫార్మాట్లలో కలిపి 10 హాఫ్ సెంచరీలు చేశారు. వేద బౌలింగ్ కూడా వేయగలరు. 2011లో ఇంగ్లాండ్ జట్టుపై వేద అరంగేట్రం చేశారు. 54 బంతుల్లో 50 పరుగులు చేశారు. 2017 మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరడంతో కీలక పాత్ర పోషించారు.

Related posts