telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాజగోపాల్ బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య -ఉత్తమ్ కుమార్ రెడ్డి

*టీఆర్ ఎస్ ,బీజేపీల‌పై కాంగ్రెస్ చార్జ్ షీట్‌..
*మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..
*రాజ‌గోపాల్ రెడ్డి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మోసం చేశారు..
*రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీ లో చేరడం దుర్మార్గమైన చర్య…

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమేనని   ఆయన బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మునుగోడులో శనివారం కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, మల్లు రవి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది.

అనంతరం ఎంపీ ఉత్తమ్‌ మాట్లాడుతూ..  ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మునుగోడు గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ, టీఆర్‌ఎస్ పాలనపై విడుదల చేసిన ఛార్జ్ షీట్‌ను కాంగ్రెస్ సైన్యం మునుగోడు నియోజకవర్గంలో గడప గడపకూ తీసుకెళ్లాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

మునుగోడులో ఏం అభివృద్ది చేశాయని టీఆర్ఎస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని.. ఓటు మాత్రం కాంగ్రెస్‌‌కు వేయాలని  కోరారు.

ఎమ్మెల్యేగా మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏం  లాభమని ప్రశ్నించారు. ఆయన గతంలో టీఆర్ఎస్‌తో దోస్తీ చేసి రాష్ట్రంలో కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు.

.

Related posts