దశాబ్దకాలంగా హైదరాబాద్ సంస్కృతి విచ్చలవిడితనంగా రూపుమార్చుకుంటుంది. వీకెండ్ కోసం క్లబ్‌లకు వచ్చే డబ్బున్నోళ్లు అక్కడ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే ఈ ఎంజాయ్ మాటున అనేక చీకటి పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. గతంలో పోలీసుల దాడిలో ఇవి బయటపడ్డాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మరోకటి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటకు వచ్చింది. నగరంలో రాత్రి లెస్బెన్స్ పబ్‌లో ఓ లేడీ డ్యాన్సర్‌పై జరిగిన దాడి ఘటనలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లెస్బన్స్ క్లబ్‌లో బాధిత యువతి జనవరి నుంచి క్లబ్ డ్యాన్సర్‌గా పని చేస్తోంది. అందులో పని చేస్తున్న తోటి క్లబ్ డ్యాన్సర్లు.. కస్టమర్ల వద్దకు వెళ్లాలని ఆమెపై ఒత్తిడి చేసేవారు. అలా వెళితే డబ్బుల వస్తాయని చెప్పేవారు.
ఈ తంతు గత కొద్ది రోజులుగా జరుగుతూ వస్తోంది. కస్టమర్ల దగ్గరకు వెళితే రూ.10 వేలు వస్తాయని తోటి క్లబ్ డ్యాన్సర్లు ఆమెకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పనులకు తాను ఒప్పుకోనని బాధితురాలు తెగేసి చెప్పడంతో వారంతా ఆమెపై కక్షకట్టారు. ఈ క్రమంలోనే పబ్‌లో ఆమెపై రోజు రోజుకు వారి అకృత్యాలు ఎక్కువ అయ్యాయి. ఆమె శరీరంపై బ్లేడుతో దాడి గాయపరిచారు. అంతటితో ఆగకుండా శుక్రవారం రాత్రి క్లబ్ ఆర్గనైజర్ సయ్యద్‌తో పాటు మరో నలుగురు క్లబ్ డ్యాన్సర్లు ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వివస్త్రను చేసి.. అసభ్యకరంగా ప్రవర్తించారు. క్లబ్‌లో తనలాంటి వాళ్లు చాలా మంది బాధితులు ఉన్నారని ఆమె తెలిపింది. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.