telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..-హరీష్ రావు‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్

*తెలంగాణ నేత‌లకు నిర్మ‌లా సీతారామ‌న్ కౌంట‌ర్లు
*తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?..అది చెప్పండి

తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2017 నుండి 2019 లోపల రెండు వేల మంది రైతులు  ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయని  పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న నిర్మలాసీతారామన్… గాంధారిలో తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్‌ రావు చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

నిన్న తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనపై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దాడి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉంటే నేరుగా చెప్పాలని సూచించారు.

పక్క రాష్ట్రాలు చూడాలని తెలంగాణ మంత్రి అంటున్నారని.. ముందు ఇక్కడ ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూడాలని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

ఎన్నికల్లో రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ వంద మంది రైతుల్లో ఐదు మందికే రుణమాఫీ జరిగిందన్నారు. ఇది తాను చెప్పింది కాదని.. ఎస్‌బీఐ చెప్పిందని తెలిపారు.

మల్లన్నసాగర్ ,మిడ్ మానేరు ,సీతారామ ప్రాజెక్టు ల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. వీటికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టిఆర్ ఎస్ నాయకుల తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మండిపడ్డారు.

ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయినవారికి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని రైతు సమస్యలకు అనుగుణంగా రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తోందని నిర్మల అన్నారు. ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధాని మోదీకి తెలుసని వ్యాఖ్యానించారు

తెలంగాణకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 7,658 కోట్లు ఇచ్చామని తెలిపారు. కృషి వికాస్ యోజన కింద రూ. 8,590 కోట్లు ఇచ్చినట్టుగా చెప్పారు. తెలంగాణకు ఎన్‌ఎఫ్‌ఎన్‌ఎస్ స్కీమ్ కింద రూ. 51 కోట్లు ఇచ్చామని అన్నారు.

Related posts