telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌‌ను ప్రారంభించిన కేటీఆర్‌..

ఇంటి నిర్మాణ అనుమతులు సులభతరంగా.. పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో మంజూరు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీ-పాస్ విధానాన్నిపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చామని.. తెలంగాణలోని 43 శాతం జనాభా పట్టణ ప్రాంతంలో ఉందన్నారు. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలు సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉందని… ఒకవైపు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన చేపడుతూనే మరోవైపు అధికార వికేంద్రీకరణ ద్వారా పౌరులకి మంచి సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మేలు చేసే చట్టాలను ఏర్పాటు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చునని, ఈ స్పూర్తితోనే టీఎస్ బీ-పాస్ వంటి నూతన చట్టాలను తీసుకు వస్తున్నామని తెలిపారు. ఒక్క పైస ఇచ్చే అవకాశం, అవసరం లేకుండా… గతంలో నెలల సమయం పట్టే రిజిస్ట్రేషన్లు ఈరోజు అత్యంత పారదర్శకంగా ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్నాయని… తెలంగాణ ప్రభుత్వ చట్టాలను, విధానాలను కేంద్ర ప్రభుత్వం తో పాటు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా ఏ విధంగా అయితే విజయవంతంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే అద్భుతమైన సంస్కరణ చేపట్టిమో, అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణాల కోసం టీఎస్ బీ-పాస్ తీసుకువచ్చామని తెలిపారు. ఈ విధానంతో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా సులభంగా అనుమతులు లభిస్తాయన్నారు. 75 గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతి వస్తుందని.. 600 పైన 21 రోజుల్లో అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధ్రువీకరణలు, అబద్ధాలు, తప్పుడు ధ్రువీకరణ చేస్తే భవన నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీ-పాస్ చట్టం, విధానం దేశంలోనే అత్యుత్తమ భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియగా నిలువబోతుందని తెలిపారు.

Related posts