టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో కారు దౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చించారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో నెల్లికల్లుతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న ఆయకట్టు పోను, మిగిలిన భూములకు సాగునీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతోపాటు 8 నుంచి 9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నెల 10న మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లల్లో హాలియా నుంచి సూర్యాపేట వరకు ఏ లక్ష్యంతో పాదయాత్ర చేపట్టామో అది నెరవేరిందని, నల్లగొండ కొంత భాగం మినహా అంతాసాగులోకి వచ్చి రైతుల జీవితాలు బాగుపడ్డ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నట్టు తెలుస్తున్నది. సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్, ఇతర ముఖ్యప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
previous post
next post