telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో పెను విషాదం :’రెబల్ స్టార్’ కృష్ణంరాజు కన్నుమూత

టాలీవుడ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.

ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 3.25 గంటలకు ఆయన చనిపోయినట్లుగా ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.

వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయనకు సీతాదేవితో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరికి పిల్లలు లేరు. ఓ కూతురుని దత్తత తీసుకున్నారు. అయితే 1995లో సీతాదేవి కారు ప్రమాదంలో కన్నుమూసింది. ఒంటరివాడైన కృష్ణంరాజుకి ఏడాది తర్వాత 1996 సెప్టెంబర్‌ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు. వీరికి  ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేశారు.. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 

అవే కళ్లు అనే చిత్రం ద్వారా విలన్ గా కూడా కృష్ణంరాజు నటించారు.  1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.

బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, తల్లీ కొడుకులు, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తాండ్ర పాపారాయుడు, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, బావా బావమరిది లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భక్త కన్నప్ప టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. శివ భక్తుడిగా కృష్ణం రాజు నటన అబ్బురపరిచింది.

 ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండో తరం స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు.

1991లో కృష్ణంరాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరిన కృష్ణంరాజు 1999లో జరిగిన అదే ఎంపీ స్థానం నుండి మధ్యంతర ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. దశాబ్దాల ప్రస్థానంలో కృష్ణంరాజు అనేక ముఖ్యమైన పదవులు చేపట్టారు.

కృష్ణంరాజు మరణవార్త విన్న టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

 

 

 

 

 

Related posts