ఒకప్పుడు టాలీవుడ్ లో తన హవా కొనసాగించిన త్రిష ప్రస్తుతం లేడి ఓరియంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకున్నా తమిళంలో మాత్రం విజయాలు అందుకుంటోంది. విజయ్ సేతుపతి సరసన నటించిన 96 చిత్రం భారీ హిట్ సాధించింది. ప్రస్తుతం త్రిష రాంగి అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ కథ అందిస్తున్నారు. శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల రాంగి చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని త్రిష సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ సంధర్భంగా త్రిష అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నారా ? అని ప్రశ్నించగా… స్పందించిన త్రిష “ఎలాంటి రిలేషన్స్ లేవు. కానీ ఓ వ్యక్తి నుంచి ప్రేమను పొందుతున్నా” అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనితో త్రిష ఎవరితోనో ప్రేమలో ఉందనే నిర్దారణకు వస్తున్నారు ఆమె అభిమానులు. 2015లోనే చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల త్రిష నిశ్చితార్థం రద్దయింది. గతంలో త్రిష టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో డేటింగ్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఆ మధ్యన త్రిష రానా గురించి మాట్లాడుతూ అతడు “లేడీస్ మాన్” అనే రొమాంటిక్ కామెంట్ కూడా చేసింది. మరి ఇప్పుడు త్రిష ఎవరితో ప్రేమలో ఉంది అనే విషయం ఆసక్తికరంగా మారింది.