telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీసుల అదుపులో హీరోయిన్ రాగిణి ద్వివేది… కర్ణాటకలో డ్రగ్స్ ప్రకంపనలు

Ragini Dwivedi

కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేది ఇరుక్కున్నారు. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బెంగళూరులో డ్రగ్స్ దందాను బట్టబయలు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ ముఠా కన్నడ సినీ పరిశ్రమలో నటీనటులు, గాయకులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఎన్‌సీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే రాగిణి స్నేహితుడు రవిశంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరు గంటలపాటు రవిశంకర్‌ను ప్రశ్నించిన సీసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి ఐదు రోజుల పోలీస్ కస్టడీని విధించింది. రవిశంకర్‌ ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంటాడని, అతను శాండిల్‌వుడ్‌లో పలువురు నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీసీబీ చీఫ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) శుక్రవారం బెంగళూరులోని రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు నిర్వహించింది. కోర్టు మంజూరు చేసిన సెర్చ్ వారెంట్‌తో మహిళా ఇన్‌స్పెక్టర్‌తో సహా సీసీబీ అధికారులు యలహంకలోని రాగిణికి చెందిన రెండు ఇళ్లలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సోదాలు నిర్వహించారు. రాగిణి ఇళ్లలో సోదాలు నిర్వహించిన తరవాత ఆమెను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను సీసీబీ కార్యాలయానికి తరలించారు. రాగిణి తన లాయర్లతో కలిసి సొంత వాహనంలో సీసీబీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, రాగిణి ఇళ్లలో అధికారులు ఎలాంటి మాదకద్రవ్యాలు గుర్తించలేదని, రెండు ఆల్కహాల్ బాటిళ్లను మాత్రమే గుర్తించారని సీసీబీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, రాగిణి సీసీబీ కార్యాలయానికి వచ్చినప్పుడు అక్కడంతా హడావుడి వాతావరణం కనబడింది. తెలుగులో నాని ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో నటించారు. రాగిణి తెలుగులో నటించిన ఏకైక సినిమా ఇది.

Related posts