telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాలుష్యంతోనే చస్తున్నాం.. ఇంకా ఉరి అవసరమా .. నిర్భయ నిందితుడి సెటైర్..

nirbhaya case accused on hang and pollution

దిల్లీలో ఏడేళ్ల క్రితం అమానవీయంగా నిర్భయపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టిన ముద్దాయిలను ఏ క్షణమైనా ఉరి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన అక్షయ్‌ సింగ్‌ ఠాకూర్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని కోరాడు. మరణ శిక్ష నుంచి తప్పించుకొనేందుకు పిచ్చి కారణాలను పేర్కొన్నాడు. దిల్లీలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో ఆయుష్షు తగ్గిపోతోందని.. అందువల్ల తనకు ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాడు. వాయు కాలుష్యంతో దిల్లీ రాజధాని ప్రాంతం, మెట్రో నగరం గ్యాస్‌ ఛాంబర్‌లా మారిందనీ.. దిల్లీలో నీరు, గాలి విషపూరితమైందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. నీరు, వాయు కాలుష్యంతో దిల్లీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో ప్రజలందరికీ తెలుసన్నాడు. ఆయువు తగ్గిపోతుంటే మరి ఇంకా ఉరిశిక్ష ఎందుకు? అని పేర్కొన్నాడు.

2012 డిసెంబరు 16న పారామెడికల్‌ విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి, అత్యంత హేయమైన చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం సింగపూర్‌కు తరలించగా ఆమె అక్కడ కన్నుమూసింది. ఆరుగురు ముద్దాయిల్లో ఒకడు బాల నేరస్థుడు కాగా మరో వ్యక్తి రామ్‌సింగ్‌ 2013 మార్చిలో తిహార్‌ కారాగారంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగిలిన నలుగురు ఊచలు లెక్కపెడుతున్నారు. వీరిలో వినయ్‌శర్మ, అక్షయ్‌ ఠాకుర్‌, ముకేష్‌ సింగ్‌, పవన్‌ గుప్తా కారాగారంలో ఉన్నారు. చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయని, చివరి ప్రయత్నంగా కావాలంటే రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించుకోవచ్చని ఈ నలుగురికి ఈ ఏడాది అక్టోబరు 29నే కారాగార వర్గాలు తెలిపాయి. వీరిలో వినయ్‌ ఒక్కడే అర్జీ పెట్టుకోగా దానిని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్‌ కూడా ఇటీవలే రాష్ట్రపతికి సిఫార్సు చేశాయి. దీనిపై హోంశాఖతో సంప్రదించి, రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. గతంలో ముగ్గురితో కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయని అక్షయ్‌ ఠాకూర్‌ సోమవారం తన మరణదండన తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశాడు. గతంలో మిగిలిన ముగ్గురు దాఖలు చేసిన ఇలాంటి అర్జీలను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే.

Related posts