telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కనిష్ట స్థాయికి.. ఉష్ణోగ్రతలు… వణికిపోతున్న ప్రజలు… తెలుగులోనూ ఇంతే..

temperatures go down effects lot on people

దేశం మొత్తం చలితో అల్లల్లాడి పోతుంది. ఇక ప్రధాన నగరాలలో అయితే మాములే, వివిధ కారణాల వలన ఈ నగరాలలో ఎప్పుడు ఏదైనా తీవ్రంగానే ఉంటుంది. చలి కూడా అలాగే తీవ్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎనిమిది డిగ్రీల వరకు తక్కువగా నమోదు అవుతున్నాయి.

ఉదయం పది గంటలలోపు, సాయంత్రం ఆరు గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్వెటర్స్, మాస్క్‌లు ధరించి పనులకు వెళ్తున్నారు. ఉత్తర భారత నుంచి వీస్తున్న శీతల గాలుల ఉధృతితో తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. మరో రెండు రోజులు వీటి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, మెదక్, రామగుండం, హన్మకొండ, హైదరాబాద్‌లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటున్నా, రాత్రి సమయంలో మంచుతో వాతావరణం బాగా చల్లబడుతోంది.

మరోవైపు అతి శీతల గాలులు హైదరాబాద్ వాసులను వణికిస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులతో వాతావరణం పొడిగా మారింది. ఇక రాత్రి వేళ ఉష్ణోగ్రతలు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. చలి తీవ్రత మరో రెండు రోజులు ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అటు ఉత్తర, ఈశాన్య భారతంలో పరిస్థితి దారుణంగా ఉంది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, బీహార్, వారణాసిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో నీరు గడ్డకడుతోంది. ఢిల్లీ, అమృత్‌సర్‌లో మంచుదుప్పటి కమ్మేసింది. దీంతో రవాణావ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కొండలు, లోయల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏజెన్సీ ప్రాంత వాసులు అల్లాడుతున్నారు. కీలాల్, కల్ప, మనాలి, కార్గిల్, లడక్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరువ కావడంతో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.

Related posts