తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మరో వెసులుబాటు కల్పించారు.రైతుబంధు సాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వానకాలం సీజన్ నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున.. రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు అందజేయనున్నట్టు తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతుబంధు అమలు మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి శనివారం విడుదలచేశారు. గతేడాది సీజన్‌కు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా, ఈ వానకాలం నుంచి దానిని రూ.5 వేలకు పెంచారు.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రాష్ట్రం అమలు చేసిన ‘రైతుబంధు’ పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని, ఇదో గొప్ప పథకమని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్రం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రైతు బంధు పథకమే ప్రేరణ అన్నారు. రైతు మరణిస్తే రైతు బీమా పథకం కింద రూ.5 లక్షలు అందజేస్తున్నామని, ఈ పథకానికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సమర్థవంతంగా వినియోగించుకున్నామని,మహబూబ్‌నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించడంలో సఫలమయ్యామని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు.

