telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత జట్టును రెండుగా విడదీయనున్న బీసీసీఐ…

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, బలమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ కి పెద్ద సవాలు ఎదురైంది. బీసీసీఐ చెప్పినట్లే ఐసీసీ ఆడుతున్నదని, పలు క్రికెట్ బోర్డులు విమర్శలు చేస్తున్న సమయంలో ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమిండియా టైట్ షెడ్యూల్ కారణంగా ఆసియాకప్ వాయిదాపడే ప్రమాదం ఏర్పడింది. దాంతో భారత జట్టును రెండుగా విభజిస్తే ఎలా ఉంటుందనేదానిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది.ఇటు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రెండింటికీ తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత జట్టు ఆ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ జట్టుతో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనున్నది. ఇందుకోసం సుదీర్ఘకాలం ఇంగ్లండ్‌లోనే గడపాలి. అదే సమయంలో ఆసియాకప్ కూడా ఉండటంతో జట్టును రెండుగా విభజించేందుకు బీసీసీఐ రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది.టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లడంతో ఐపీఎల్ ను కూడా ఒక వారం ముందే ముగిస్తున్నారు. ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు వెళ్లకుంటే జూన్ రెండో వారంలో శ్రీలంక వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీ నిర్వహించాలని భావించారు. గత సెప్టెంబర్‌లోనే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదాపడింది. టీమిండియా తప్పకుండా ఆడాలని భావించిన పాకిస్థాన్ కూడా.. తమ ఆతిథ్యాన్ని శ్రీలంకకు ఇచ్చింది.

ఇప్పుడు భారత జట్టు అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడంతో ఆసియాకప్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నది. ఆ తర్వాత రెండు వారాలకే ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత్ అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.భారత టెస్ట్ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ టీ20లు కూడా ఆడుతుంటారు. డబ్ల్యూటీసీ, ఇంగ్లండ్ సిరీస్‌లో వీళ్లు తప్పకుండా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. దీంతో ఆసియాకప్ కోసం ఒక టీ20 జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తున్నది. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, నవ్‌దీప్ సైనీలతో పాటు యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి, నటరాజన్, సూర్యకుమార్ యాదవ్‌లతో కూడిన జట్టును ఆసియాకప్‌కు పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జైషా టెస్ట్‌లు, టీ20లకు వేర్వేరు జట్లు పంపడం వల్ల ప్రపంచ క్రికెట్‌కు సానుకూల సంకేతాలు పంపినట్లు ఉంటుందని, బీసీసీఐపై ఇప్పటికే ఉన్న అపవాదులు కూడా తొలగిపోతాయని భావిస్తున్నారు. త్వరలోనే బీసీసీఐ సమావేశంలో రెండు జట్ల సిద్దాంతంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.ఈ రెండు జట్ల సిద్దాంతం సక్సెస్ అయితే భవిష్యత్తులో భారత్ ఒకే సమయంలో రెండు సిరీస్‌లు ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related posts