telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : ముంబై సంచలన విజయం..

ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి దాకా ఏమంత గొప్పగా రాణించని కీరన్‌ పొలార్డ్‌.. బుధవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు చుక్కలు చూపించాడు. రోహిత్‌ శర్మ గాయంతో మ్యాచ్‌కు దూరం కావడంతో తాత్కాలికంగా ముంబయి పగ్గాలందుకున్న పొలార్డ్‌ (83; 31 బంతుల్లో 3×4, 10×6).. సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించాడు. మొదట కేఎల్‌ రాహుల్‌ (100 నాటౌట్‌; 64 బంతుల్లో 6×4, 6×6), క్రిస్‌ గేల్‌ (63; 36 బంతుల్లో 3×4, 7×6) మెరుపులతో పంజాబ్‌ 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం ముంబయి సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి ఛేదన పూర్తి చేసింది. మహ్మద్‌ షమి (3/21) అద్భుతంగా బౌలింగ్‌ చేసినా.. మిగతా బౌలర్లను ఉతికారేసిన పొలార్డ్‌ ముంబయికి విజయాన్నందించాడు.

9వ ఓవర్లో పొలార్డ్‌ క్రీజులోకి వచ్చే సమయానికి ముంబయి పరిస్థితి ఏమీ బాగా లేదు. సిద్దార్థ్‌ లాడ్‌ (15), డికాక్‌ (24), సూర్యకుమార్‌ (21)ల వికెట్లు కోల్పోయిన ముంబయి అప్పటికి 56 పరుగులే చేసింది. తర్వాతి ఓవర్లో 3 పరుగులే రావడంతో చివరి 60 బంతుల్లో విజయానికి 133 పరుగులు అవసరమయ్యాయి. దీనితో ముంబయి విజయం అసాధ్యంలాగే కనిపించింది. కానీ పొలార్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి పరిస్థితిని మార్చేశాడు. ఒక్క షమి మినహా పంజాబ్‌ బౌలర్లెవరినీ అతను విడిచిపెట్టలేదు. సిక్సర్లు బాదడం ఇంత సులువా అన్నట్లుగా అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. ఐతే పొలార్డ్‌ ఎంత ధాటిగా ఆడుతున్నప్పటికీ.. అతడికి అవతలి ఎండ్‌ నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో ఛేదన కష్టంగానే కనిపించింది. షమి.. 16వ ఓవర్లో హార్దిక్‌ పాండ్య (19), కృనాల్‌ పాండ్య (1)లను ఔట్‌ చేయడమే కాక 9 పరుగులే ఇచ్చాడు. షమి వేసిన 18వ ఓవర్లోనూ 8 పరుగులే వచ్చాయి. మిగతా ఓవర్లలో పొలార్డ్‌ చెలరేగిపోయాడు. కరన్‌ వేసిన 17, 19 ఓవర్లలో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. ఈ రెండు ఓవర్లలో 31 పరుగులు రావడంతో ముంబయి పని తేలికైంది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. అంకిత్‌ రాజ్‌పుత్‌ తొలి బంతికి నోబాల్‌ వేశాడు. ఆ బంతికి సిక్సర్‌ కూడా వెళ్లింది. ఫ్రీ హిట్‌కు ఫోర్‌ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 పరుగులు వచ్చి.. సమీకరణం 5 బంతుల్లో 4 పరుగులుగా మారింది. విజయం ఇక లాంఛనమే అనుకుంటే.. రెండో బంతికి పొలార్డ్‌ ఔటైపోయాడు. మూడో బంతికి పరుగు రాలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. తర్వాతి రెండు బంతులకు సింగిల్స్‌ వచ్చాయి. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఐతే చివరి బంతికి అంకిత్‌ ఫుల్‌టాస్‌ వేయగా.. అల్జారి జోసెఫ్‌ (15 నాటౌట్‌) తెలివిగా లాంగాన్‌ వైపు బంతిని నెట్టి చకచకా రెండు పరుగులు తీసేయడంతో ముంబయి విజయం పూర్తయింది.

ఓవైపు కేఎల్‌ రాహుల్‌.. మరోవైపు క్రిస్‌ గేల్‌ చెలరేగిపోవడంతో పంజాబ్ జట్టుకు తిరుగులేని ఆరంభం లభించింది. 12 ఓవర్లకు పంజాబ్‌ స్కోరు 113/0 కావడం విశేషం. మొదట్లో గేల్‌, రాహుల్‌ నెమ్మదిగానే ఆడారు. 4 ఓవర్లకు స్కోరు 20 పరుగులే. బెరెన్‌డార్ఫ్‌ వేసిన ఐదో ఓవర్లో గేల్‌ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదేశాడు. ఈ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. ఆపై హార్దిక్‌ పాండ్య వేసిన 9వ ఓవర్లోనూ గేల్‌ ధాటికి 17 పరుగులొచ్చాయి. గేల్‌ 31 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయగా.. 11 ఓవర్లకే పంజాబ్‌ స్కోరు 100 దాటిపోయింది. గేల్‌ ఊపు చూస్తే మరో మెరుపు సెంచరీ ఖాయమనిపించింది. కానీ, 13వ ఓవర్లో బెరెన్‌డార్ఫ్‌ అతడిని పెవిలియన్‌ చేర్చడంతో ముంబయి ఊపిరి పీల్చుకుంది. ఈ వికెట్‌తో ఆ జట్టు బాగానే పుంజుకుంది. 13-16 మధ్య 4 ఓవర్లలో 3 వికెట్లు సహా 30 పరుగులే వచ్చాయి. చివరి 3 ఓవర్లలో రాహుల్‌ చెలరేగి ఆడటంతో ఏకంగా 54 పరుగులొచ్చాయి. 17 ఓవర్లు ముగిసేపటప్పటికి 52 బంతుల్లో 64 పరుగులు చేసిన రాహుల్‌.. ఇంకో 11 బంతులకే సెంచరీ అందుకోవడం విశేషం.

mumbai won on punjab in ipl 2019 matchనేడు మ్యాచ్ : రాజస్థాన్ vs చెన్నై రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Related posts