telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల మృతి..

మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు (72)శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.

గ‌త కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

చంద్రశేఖర్ రాజు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. చంద్రశేఖర్ రాజు టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు.

అంతేకాదు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి చంద్రశేఖరరాజు స్వయాన మామ అవ్వగా.. టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు.. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు విషాదంలో మునిగిపోయారు.

శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94లో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

2009లో కురుపాం నియోజకవర్గం ఏర్పడింది. 2009లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కోడలు పాముల పుష్పశ్రీవాణి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018లో వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు చంద్రశేఖర్ రావు.

2019 ఎన్నికల సమయంలో తిరిగి సొంతగూటికి వచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి మళ్లీ గెలుపొందారు. అనంతరం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం, గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆమె తన పదవిని కోల్పోయారు.

చంద్రశేఖరరావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సంతాపం ప్రకటించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శత్రుచర్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు.

Related posts