తన పుట్టుక గురించి మంత్రి నాగార్జున వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు.
అసెంబ్లీలో ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు.
తన పుట్టుక గురించి ఎలా మాట్లాడతారని, మరో అంబేద్కర్ వస్తేనే గాని అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేలకు న్యాయం జరగదేమోనని బాల వీరాంజనేయస్వామి అభిప్రాయపడ్డారు.
దళితులపై చిత్తశుద్ది ఉంటే తన గురించి కించపర్చేలా మాట్లాడిన మంత్రిని భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇందుకు స్పీకర్ అభ్యంతరం తెలిపారు. తనను కులం పేరుతో దూషించారంటూ మంత్రి మేరుగ నాగార్జునపై ఆరోపణ చేశారు.తాను శాసనసభ నియామావళికి విరుద్దంగా మాట్లాడలేదని మంత్రి మేరుగ తెలిపారు.
దళిత విద్యార్ధులకు స్టడీ సర్కిల్స్ విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మేరుగ నాగార్జునకు టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఎస్సీ కులంలో ఎవరు పుడతారని అనుకుంటారని చంద్రబాబు గతంలో అన్న మాటలను తాను అన్నానని, సభ్యుడిని తాను కించ పర్చలేదని మంత్రి మేరుగ నాగార్జున వివరణ ఇచ్చారు.
అయితే మేరగ చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డుల్లో ఉన్నాయని… రికార్డులు చెక్ చేసి వాళ్లు ఆ మాట అనలేదంటే తాను రాజీనామా చేస్తానని బాల వీరాంజనేయస్వామి సవాల్ విసిరారు.
నాపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారనుకున్నా. నా పుట్టుక గురించి అసెంబ్లీ మాట్లాడటం సరికాదు’’ అని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు.