టీడీపీని వీడి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తోట త్రిమూర్తులు ఎప్పటికీ తనకు శత్రువేనని అన్నారు.గతంలో వెంకటాయపాలెంలో శిరోముండనం కేసుకు సంబంధించి దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. తోట త్రిమూర్తులు తమ పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఆ కేసును వదలమని చెప్పారు.
కేసు విషయంలో ఏదైనా తేడా జరుగుతుందని బాధితులు భావిస్తే వారిని సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే దళితుల తరఫున ధర్నా చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు.
1996లో రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెంలోని కొందరు దళితులకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు కలిసి శిరోముండనం చేయించారు. ఈ సంఘటనపై నాడు కేసు నమోదు చేశారు. ఈ కేసు పలు కారణాలతో వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా ఈ కేసు పై సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.