telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

స్ట్రీట్ లైట్ పనితీరు మెరుగు పరచాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహిస్తున్న స్ట్రీట్ లైట్ పనితీరు మెరుగు పరచాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ ఈ ఎస్ ఎల్ ఏజేన్సీ ను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.ఎన్.సి, ఈ ఈఎస్ఎల్ ఎలక్ట్రిసిటీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వీధి లైట్ల పనితీరు పై మేయర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఎల్ఇడి స్ట్రీట్ లైట్లు పనితీరు పై ప్రజలు, కార్పొరేటర్ లు సంతృప్తిగా లేరని వచ్చిన సమస్యలను కూడా సత్వర పరిష్కారం చేయలేకపోతున్నారని అందుకు సరియైన సేవలు అందించని పక్షంలో జిహెచ్ఎంసి తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడానికి వెనుకాడమని ఆమె హెచ్చరించారు. పలువురు కార్పొరేటర్ లు  వారీ వార్డు కు సంభందించిన  ఫిర్యాదులు చేస్తున్నారని స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశంలో కూడా సభ్యులు  ప్రశ్నించడం జరుగుతుందన్నారు. కనీసం స్ట్రీట్ లైట్ పెట్టలేక పోతున్నామనే  ఆవేదన చెందుతున్నారని ఇకనైనా సరైన సేవలు అందించేందుకు మెన్, మెటీరియల్ స్టాక్ సిద్ధంగా పెట్టుకోవాలని అంతేకాకుండా ఈ విషయంలో వార్డు వారీగా బాధ్యులైన అధికారి నియమించాలని కోరారు. స్టాండింగ్ కమిటీకి హాజరైన కార్పొరేటర్ లు జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఉన్న సమస్యలను, లోపాలను వారి దృష్టికి తెచ్చారు. పిర్యాదులు తెలియజేసిన సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, అసలు ఎవ్వరూ బాధ్యులని కార్పొరేటర్లు  ఈఈఎస్ఎల్  అధికారులను నిలదీశారు.

ఈ సందర్భంగా కమిషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ…  నెలనెలా బిల్లులు చెల్లిస్తామని, అట్టి నిధులను  జిహెచ్ఎంసి సంబంధించిన సేవలకు మాత్రమే ఉపయోగించుకోవాలని ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పవద్దని గత ఎనిమిది నెలల నుండి సమస్య లు ఉత్పన్నమవుతున్నాయని ఇకనైనా మెరుగుపరచాలని కోరారు. అందుకు అనుగుణంగా మరమ్మతులకు సంబంధించిన స్టాక్ ను త్వరలో  గోడౌన్ లో సిద్ధం చేయాలని, ప్రతి సర్కిల్ కి రెండు చొప్పున ల్యాడర్  ఏర్పాటు చేయాలని తెలిపారు. 70 ఓల్టేజ్ బల్బులు కొరత ఉన్నందున రెండు వారాల్లో  3000 బల్బులు ఆ తర్వాత మరో 3 వేల బల్బులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు  ఎప్పటికీ బల్బుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.. అంతేకాకుండా సిసిఎంఎస్  ద్వారా -గ్లోయింగ్  ఆన్ ,ఆఫ్ మాన్యువల్ గా చేస్తున్నారని, ఇది కూడా సక్రమంగా చేయడం లేదన్నారు. అంతే కాకుండా ఒప్పందం ప్రకారం 5 శాతం బఫర్ స్టాక్ నిర్వహించడం లేదు.  శాశ్వతంగా  సమస్యలు లేకుండా లిఖిత పూర్వకంగా  రెండు రోజుల్లో తెలియజేయాలని  ఈ ఈ యస్ ఎల్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీమతి శాంతి సైజెన్ శేఖర్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహమ్మద్ అబ్దుల్ ముక్తాదర్, మహమ్మద్ మాజిద్ హుస్సేన్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్,  బండారి రాజ్ కుమార్, వనం సంగీత యాదవ్, రాగం నాగేందర్ యాదవ్, టి. మహేశ్వరి, ఆర్.సునీత, జోనల్ కమిషనర్లు శంకరయ్య, అశోక్ సామ్రాట్, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, ఇ.ఇ.ఎస్.ఎల్ సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts