పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని తప్పుబట్టారు. పెట్రోలు, డీజిల్‌పై మితిమీరిన ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి సర్కార్ అమితోత్సాహం ప్రదర్శిస్తోందని విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో మధ్య తరగతి, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు సోనియాగాంధీ. దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి చమురు ధరలు చేరాయన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరగటాన్ని ఆమె తప్పుబట్టారు. కరోనా కారణంగా దిగిజారిన ఆర్థిక వ్యవస్థతో ఓవైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, కుటుంబ ఆదాయాలు, వేతనాలు తగ్గిపోతున్నాయని.. మధ్య తరగతి ప్రజలు, మన సమాజంలో అణగారిన వర్గాలవారు తీవ్ర ఇబ్బందులను అనుభవిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ అధినేత్రి.. ఈ సమస్యలకు తోడు ద్రవ్యోల్బణం, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు, ఇబ్బందుల నుంచి లాభాలు పిండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. మరోవైపు.. వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంపై కూడా సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.800కు చేరిందని, ఇది చాలా క్రూరమైన విధానమని మండిపడ్డారు. చూడాలి మరి ఈ లేఖకు బీజేపీ ఎలా సమాధానం ఇస్తుంది అనేది.
previous post
next post