telugu navyamedia
సినిమా వార్తలు

దర్శకుడు బి.గోపాల్ కు సత్యజిత్ రాయ్ అవార్డు

కేరళ రాష్ట్రంలోని సత్యజిత్ రాయ్ ఫిలిం సొసైటీ ఈ సంవత్సరం గోపాల్‌కు ఈ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది. సత్యజిత్ రాయ్ ఫిలిం సొసైటీ గత మూడు సంవత్సరాలనుంచి సత్యజిత్ రాయ్ పేరుతో దేశంలోని చిత్ర ప్రముఖులకు ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం మలయాళ చిత్ర దర్శకుడు బాలు కిరియాత్, సంగీత దర్శకుడు పెరుంబవూర్ జి.రవీంద్రనాథ్ మరియు సినిమా రంగానికి సంబంధించిన  మరికొందరితో ఒక కమిటీ నియమించింది. దర్శకుడు బి.గోపాల్ తెలుగు హిందీ భాషల్లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు.

ఏ కథనైనా తనదైన పద్దతిలో విజయవంతమైన చిత్రాలుగా మలచడంలో గోపాల్ సిద్ధహస్తుడు. అందుకే ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు గోపాల్‌ను ఎంపిక చేసినట్టు సత్యజిత్ రాయ్ ఫిలిం సొసైటీ ఓక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును ఇప్పటివరకు ఆదూర్ గోపాలకృష్ణన్ , బెంగాలీ నటి మధబ్ ముఖర్జీ , నిర్మాత జి.మోహన్ స్వీకరించారు. నాలుగవ సంవత్సరం తెలుగు దర్శకుడు బి. గోపాల్ ను ఎంపిక చేశారు. ఈ అవార్డుతో పాటు 10,000 రూపాయల నగదు, ఒక జ్ఞాపిక, ఒక ఫలకాన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కార్యక్రమం ఈ నెల 13న హైదరాబాద్‌లో జరుగుతుందని రాయ్ ఫిలిం సొసైటీ తెలిపింది.


దర్శకత్వ శాఖ లో చురుకుగా పనిచేస్తున్న బి.గోపాల్ లోని ప్రతిభను గుర్తించిన మూవీ మొఘల్ పద్మభూషణ్ డి. రామానాయుడు గమనించి 1986వ సంవత్సరంలో “ప్రతిధ్వని ” చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు. రామానాయుడు గారి అంచనా తప్పలేదు . గోపాల్ ఆయన గర్వించే దర్శకుడయ్యారు.

రామానాయుడు హస్తవాసి: తెలుగులో ” ప్రతిధ్వని”, బొబ్బిలి రాజా”, “లారీ డ్రైవర్”, ” అసెంబ్లీ రౌడీ”, “స్టేట్ రౌడీ”, “రౌడీ ఇన్స్పెక్టర్”, “సమరసింహా రెడ్డి”, “నరసింహ నాయుడు”, “అడవిలో అన్న”, “ఇంద్ర”, “చిన్నరాయుడు” ” బ్రహ్మ”, “మెకానిక్ అల్లుడు”, “కలెక్టర్ గారు”, “అల్లరి రాముడు”, “అడవి రాముడు”, చిత్రాలను రూపొందించారు. హిందీలో రేఖ, అనిల్ కపూర్, రిచా శర్మ తో “ఇన్సాఫ్ కి ఆవాజ్”, దిలీప్ కుమార్, నూతన్, సంజయ్ దత్, మాధురి దీక్షిత్‌తో” కానూన్ అప్నా అప్నా” చిత్రాలకు దర్శకత్వం వహించారు. సత్యజిత్ రాయ్ అవార్డు తనకు ప్రకటించడం పట్ల దర్శకుడు గోపాల్ హర్షం వ్యక్త చేశారు.

నవ్య మీడియా ” తో మాట్లాడుతూ.. “భారత దేశంలోనే అత్యుత్తమ శ్రేణి దర్శకుడు సత్యజిత్ రాయ్ . మన దేశానికి తన సినిమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన దర్శకుడు రాయ్ . అలాంటి రాయ్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు నాకు ప్రకటించడం నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగించింది . గోపి చందు తో నేను దర్శకత్వము వహించిన “ఆరడుగుల బుల్లెట్ ” సినిమా విడుదలైన రోజునే ఈ అవార్డును నాకు ప్రకటించడం మరింత ఆనందాన్ని కలిగించింది ” అన్నారు.

“గతంలో నాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నుంచి నంది అవార్డు , ఫిలిం ఫేర్ అవార్డు లభించాయి . కానీ సత్యజిత్ రాయ్ అవార్డు నాకు జాతీయ అవార్డుతో సమానం . నిజంగా ఈ అవార్డు ను నేను ఎప్పుడు ఊహినలేదు . ఈ అవార్డును మొదట ఆదూరి గోపాలకృష్ణన్ గారికి ప్రదానం చేశారు.

మళ్ళీ దర్శకుడుగా నన్ను ఎంపిక చెయ్యడం ఆ అదృష్టంగా భావిస్తున్నా . ఈ సందర్భముగా నన్ను సినిమా రంగానికి పరిచయం చేసిన పద్మభూషణ్ రామానాయుడు గారు ఉంటే ఎంత సంతోషించేవారో అనిపించింది . నా ఎదుగుదలకు , ఈ పేరు ప్రఖ్యాతులకు అన్నింటికీ కారకులు అయిన దివంగ‌త‌ రామానాయుడు గారిని ప్రతి రోజు ఆయన్ని స్మరించకుండా ఉండలేను . ఆయన నాకు ప్రాతః కాల స్మరణీయులు ” అని భావోద్వేగంగా చెప్పారు గోపాల్.  ప్రతిష్టాత్మమైన సత్యజిత్ రాయ్ అవార్డును స్వీకరించబోతున్న దర్శకుడు గోపాల్ కు “నవ్య మీడియా ” అభినందనలు తెలుపుతోంది.

– భగీరథ

Related posts