ఈ ఏడాది ఆంగ్లసాహిత్యంలో ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ కోసం పోటీ పడుతున్న వారి జాబితాలో ప్రముఖ రచయితలు సల్మాన్ రష్దీ, మార్గెరేట్ ఆట్‌వుడ్‌తో సహా 13 మంది వున్నారు. 2018 అక్టోబర్ నుండి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ బ్రిటన్, ఐర్లండ్‌లలో ప్రచురితమైన మొత్తం 151 నవలలను ఈ పురస్కార పోటీకి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో ఎనిమిది మంది రచయిత్రులు, ఐదుగురు రచయితలు వున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
గతంలో ఒకసారి బుకర్ ప్రైజ్‌ను గెల్చుకున్న రష్దీ రచించిన ‘క్విచోట్’ నవలతోపాటు ఆట్‌వుడ్ రచించిన ‘ది టెస్టామెంట్’ నవల సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. దీనితోపాటు తొలిసారిగా ఆంగ్లసాహితీ ప్రపంచంలోకి వచ్చిన ఒయిన్‌కన్ బ్రెయిత్‌వెట్ నవలలు ‘మై సిస్టర్, ది సీరియల్ కిల్లర్’లు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి.