telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ కు రాకపోతే జీతాల్లో కోత…?

new feature in ipl 2020

ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన బోర్డు.. షెడ్యూల్‌ను రూపొందించే పనిలో పడింది. అయితే రెండో దశ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆయా దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో యూఏఈకి వెళ్లేందుకు అనుమతించమని ఆ బోర్డులు స్పష్టం చేస్తున్నాయి. దాంతో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్లు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్‌ రెండో దశలో ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత పడనుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకు మాత్రమే వారికి వేతనాలు చెల్లిస్తారని, బీసీసీఐ ఒప్పంద ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని చెప్పారు. ‘అవును, అది నిజమే. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం యూఏఈకి రాకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకే చెల్లిస్తారు’ అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. ఉదాహరణకు కమిన్స్‌ పూర్తి వేతనం రూ.15.5 కోట్లు. అతను రాకుంటే రూ.7.75 కోట్లే చెల్లిస్తారు. బీసీసీఐ ఒప్పంద క్రికెటర్లకు మాత్రం ఇబ్బంది లేదు. 2011 నుంచి వారికి బీమా వర్తిస్తుండటమే ఇందుకు కారణం. ఇక ఎవరూ వచ్చినా రాకున్నా ఐపీఎల్ మాత్రం ఆగదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే లీగ్‌ను పూర్తి చేస్తామని తెలిపాడు.

Related posts