telugu navyamedia
క్రీడలు వార్తలు

మళ్లీ మైదానంలోకి మాజీ క్రికెటర్లు…

మాజీ క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ‘అనాకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్’లో ఆడేందుకు టీమిండియా మాజీలు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రియాన్‌ లారా, బ్రెట్ ‌లీ, తిలకరత్నె దిల్షాన్‌, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, భారత్‌కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు సిరీస్‌లో పాల్గొనబోతున్నారు. రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మార్చి 2 నుంచి 21 వరకు ఈ సిరీస్ జరగనుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది జరగాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ వాయిదా పడింది. నాలుగు మ్యాచ్‌లు జరిగిన తర్వాత సిరీస్‌ను నిలిపివేశారు. ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లన్నీ రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన 65 వేల సామర్థ్యం కలిగిన స్టేడియంలో జరుగుతాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో తమ మునుపటి ఆటను ప్రదర్శించేందుకు మాజీలు సన్నద్ధమవుతున్నారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ద్వారా రోడ్ ‌సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిరీస్‌ ఏర్పాటు చేశారు. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా.. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. సచిన్‌, సెహ్వాగ్‌ మళ్లీ బరిలోకి దిగనుండడంతో వారి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయో బబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహించనున్నారు.

Related posts