telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మ ఓ అద్భుతం…

అమ్మా…
నువ్వు గడపదాటి ఏడాది
మనిల్లు చిన్నబోయి ఏడాది
నువ్వు జ్ఞాపకమై ఏడాది
అమరత్వాన్నిపొంది దైవత్వమై ఏడాది
మేమంతా గుండెధైర్యాన్ని కోల్పోయి ఏడాది…
సరిగ్గా ఈరోజే కదూ…
నిద్రలేచి కళ్లు నులుముకుంటూ చూస్తే
అచేతనమైన నువ్వు…
స్పృశిస్తే నిర్జీవమై బిగుసుకుపోయి నువ్వు…
అప్పుడేగా…
మా గుండెలు బద్దలయ్యాయి
మా కళ్ళు గోదారై వర్షించాయి…
నిశితంగా చూపుల్ని గుచ్చిగుచ్చి చూసిన
నీ కళ్ళజోడు నువు లేక చూడనంటోంది…
చూపేలేదంటోంది…
నీ అడుగులో మరో అడుగై
మూడో పాదమై నీతో నడచిన చేతికర్ర
నీ ఊతం లేక నడవనంటోంది…
నిన్ను నిన్నుగా
స్త్రీత్వంతో సింగారించిన బొట్టుపెట్టెలోని అద్దం
అబద్ధమైపోయింది…
ఎన్నో ఏళ్లుగా ఓ ఆసనమై
నిను ఆప్యాయంగా
ఒళ్ళో కూర్చోబెట్టుకున్న సోఫా
మమ్మల్నీ మోస్తోంది…
కానీ.. నిన్ను ఆదరించినంత ప్రేమతో కాదు…
జీవితమంతా నిను నిద్రపుచ్చి
నువ్వు కట్టెలా మారేదాకా కడవరకు
నీ తోడున్న కర్రమంచం
నీ తోడులేక భోరున విలపిస్తోంది…
ఇలా ఒకటేమిటి…
అన్నీ… అన్నీ…
జీవితాన్ని కోల్పోతున్నాయి…
నువ్వు జీవాన్ని కోల్పోయాక…
అమ్మా…
మాకోసం మళ్లీ తిరిగిరావూ…
ఒక్కసారి…
ఒకే ఒక్కసారి…
ఇంట్లోని ప్రతీ వస్తువులో జ్ఞాపకమై,
ప్రాణమై తిరుగాడుతున్న నువ్వు
మళ్లీ రావని తెలిసినా
ఓ వెర్రి ఆశతో
తెలియని భ్రమలో
మేమంతా నీకోసం
అర్థిస్తూ…
ప్రార్థిస్తూ…
అంజలి ఘటిస్తూ…
ఇక్కడెక్కడో ఉన్నావు
మళ్లీ వస్తావని అనుభూతిపంచే
జ్ఞాపకాల భ్రమల్లో
గుమ్మానికి చూపులు అతికించుకుని
రాలేని నీకోసం
మరవలేక వేచిచూస్తూ… !
అశ్రునివాళులు అర్పిస్తూ…!!

Related posts