ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల తమ జాయినింగ్ లెటర్స్ ఇవ్వవచ్చని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఆయా జిల్లాల కలెక్టరర్ కార్యాలయంలో, ఎస్పీ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, డిఎస్పీ కార్యాలయంలోగానీ, తాము పనిచేస్తున్న డిపో మేనేజర్ కార్యాలయంలో గానీ, డివిఎం కార్యాలయంలో గానీ, రీజనల్ మేనేజర్ కార్యాలయంలో గానీ విధుల్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ ఇవ్వవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో పనిచేసే కార్మికులు బస్ భవన్‌లో ఈడీ కార్యాలయాల్లో లేఖలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు వచ్చిన లేఖలన్నీ హైదరాబాద్ చేరుకుంటాయన్నారు. వాటిని ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని, విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. కాగా.. సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ నేడు అనగా నవంబర్-05 అర్ధరాత్రితో ముగియనున్న విషయం విదితమే.