ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవడంతో సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారని సీపీఐ అగ్రనేత నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రస్తుతం విధ్వంసకర పాలన సాగుతోందని అన్నారు. మూడు రాజధానులంటూ కొత్త వివాదం సృష్టించారని విమర్శించారు. జీఎన్ రావు ఏమైనా పోటుగాడా? ఆయన గురించి అందరికీ తెలుసు అంటూ నారాయణ విరుచుకుపడ్డారు.
రాజధాని కమిటీలు కాలయాపనకే తప్ప, ఆ కమిటీలు ఇచ్చే నివేదికలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని అన్నారు. ఆ కమిటీల నివేదికలు జగన్ చెప్పినట్టే ఉంటాయని ఎద్దేవా చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే ఎందుకు నిరూపించలేకపోయారంటూ ఏపీ మంత్రివర్గాన్ని నిలదీశారు. విశాఖ భూ కుంభకోణంలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆరోపించారు.