telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ – యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా అక్టోబర్‌కి వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడైనా సినిమా విడుదలవుతుందా? లేదా? అనే సందేహంలో ఉన్న సినీ ప్రియులకు మరోసారి నిరాశే ఎదురైంది. సినిమా విడుదల గురించి తెలియజేస్తూ శనివారం మధ్యాహ్నం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఒక ట్వీట్‌ పెట్టింది.

అక్టోబర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల చేసేందుకు పోస్ట్‌ ప్రొడెక్షన్‌ చాలా వరకూ పూర్తయ్యింది. కానీ, అందరూ అనుకున్నట్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం. థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే తప్పకుండా సినిమా విడుదల చేస్తాం’ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం వెల్లడించింది. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆలియాభట్‌, శ్రియ, అజయ్‌దేవ్‌గణ్‌, ఒలీవియా మోరీస్‌, సముద్రఖని కీలకపాత్రల్లో సందడి చేయనున్నారు.

Related posts