ఈ మధ్య తెలుగులో వచ్చిన చాలా సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ అవుతున్నాయి. అయితే తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ క్రైమ్ కామెడీ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. శ్రీవిష్ణు హీరోగా నివేద థామస్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా ఏడు కోట్ల బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 20 కోట్లు వసూలు చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. 2019లో విడుదలైన ఈ తెలుగు చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తీసుకున్నారు. అజయ్ దేవ్‌గణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. తన స్వంత బ్యానర్‌పై చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘బ్రోచేవారెవరురా’ క్రైమ్ కామెడీ అజయ్‌కు బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయబోతున్నాడు. అభయ్ డియోల్, సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా అక్కడ విజయం సాధిస్తుందా… అనేది.