telugu navyamedia
క్రీడలు వార్తలు

ఫిట్‌గా లేకున్నా సచిన్ ఆడాడు…

Sachin tendulkar

2008 కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ శారీరకంగా ఫిట్‌గా లేకున్నా నొప్పిని పంటి బిగువన భరిస్తూ ఆడాడని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. అయితే ఈ సిరీస్‌లో రాబిన్ ఊతప్ప ఓపెనర్‌గా బరిలోకి దిగి మాస్టర్‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే ఆ సీరిస్‌లో సచిన్.. నొప్పితో ఎలా బ్యాటింగ్ చేశాడనే విషయం తనకు అర్థం కాలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాటి సిరీస్ విశేషాలను పంచుకున్నాడు. ‘నిజంగా మీరు ఇది నమ్మరు. సచిన్ టెండూల్కర్‌ను నేను పాజీ అని పిలిచేవాడిని. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో అతను తీవ్ర నొప్పితో బ్యాటింగ్ చేశాడు. శారీరకంగా ఫిట్‌గా లేకున్నా.. నొప్పిని పంటిబిగువన భరిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఆ నొప్పితోనే జట్టుకు విజయాలందించాడు. అంతా ఓకెనా.. సౌకర్యంగా ఉన్నారా? అని మేం అడిగిన ప్రతీసారి.. ‘నేను బాగున్నాను’అని బదులిచ్చేవాడు. ప్రతీ సారి జట్టు అవసరాన్ని గుర్తిస్తూ ఆడేవాడు. ఆ సిరీస్‌లో సచిన్ చాలా నొప్పితో ఆడాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ సిరీస్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా సచిన్‌తో జరిగిన సంభాషణ నాకింకా గుర్తుంది. ‘రాబిన్.. 32, 33, 34 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉండటం కష్టమబ్బా.. గాయాలు తిరగబెడతాయి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.’అని సచిన్ నాతో అన్నాడు. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. దానికి నేను ‘అలా ఏం ఉండదు పాజీ.. మీరు ఊరికే అలా చెబుతున్నారు.’అన్నాను. వెంటనే సచిన్.. ‘రాబిన్.. నీకు 35 ఏళ్లు వచ్చిన తర్వాత మళ్లీ దీని గురించి మాట్లాడుకుందాం. అప్పుడు నాతో నువ్వు అంగీకరిస్తావో లేదో చూద్దాం’అని చెప్పాడు. ఇప్పుడు నాకు 35 ఏళ్లు.. మీ అందరికి నేను చెబుతున్నా.. సచిన్ చెప్పింది నిజమే’అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

Related posts