telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రపంచబ్యాంక్‌ సహకారంతో .. ఎపిలో వాటర్ షెడ్ ప్రాజెక్ట్..

world bank ready to work with AP on

ప్రపంచబ్యాంక్‌ కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌ లలో భాగస్వామిగా ఉన్న విషయం విదితమే. అదే తరహాలో తాజాగా ఎపితో కూడా కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంక్ ఆసక్తి చూపిస్తోంది. వారిచ్చే నిధులతో దేశంలోనే వాటర్‌ షెడ్‌ కార్యక్రమాలను అమలు చేసే మూడో రాష్ట్రంగా ఎపిని ఎంపిక చేసింది. దీనిలో భాగంగా అయిదేళ్ల పాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్‌ డాలర్ల మేరకు రుణంగా అందించేందుకు ప్రపంచబ్యాంక్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో కూడిన బృందం బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యింది.

ఈ సమావేశంలో వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో నీటియాజమాన్యం, భూసార యాజమాన్యం, మెరుగైన వ్యవసాయ విధానాలు, గ్రామీణ వ్యవసాయరంగ ఆర్థిక అభివృద్ధి విధానాలను అమలు చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌లో 70శాతం ప్రపంచబ్యాంక్‌, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చేలా సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను మొదటిదశ వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌ అమలుకు ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రాజెక్ట్‌ను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, ఎపి స్పేస్‌ అప్లికబుల్‌ సెంటర్‌, వ్యవసాయ యూనివర్శిటీల కన్సార్టియం ద్వారా పర్యవేక్షణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Related posts