telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ తో ఇక పనిలేదా..?

అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్‌ కమ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ బెన్ ‌స్టోక్స్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో తనవంతు పాత్ర పోషించాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని గొప్ప విజయాన్ని అందించాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది‌. 54 పరుగులతో అజేయంగా నిలిచిన అతడిని క్రీడా నిపుణులు, కామెంటేటర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలాగే సంజూ కూడా క్రికెట్‌ అభిమానుల ప్రేమను పొందేందుకు అర్హుడని, తాజా హాఫ్‌ సెంచరీతో ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే టీమిండియా అభిమానులు సంజూను ప్రశంసిస్తూనే, అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిషబ్ పంత్‌ను ట్రోల్చేస్తున్నారు.

రిషబ్ పంత్‌ కన్నా బ్యాట్స్‌మెన్‌గా, వికెట్‌ కీపర్‌గా మెరుగ్గా రాణించగలిగిన సత్తా ఉన్న సంజూ శాంసన్‌కే తమ ఓటు అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. ‘సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరోసారి మా మనసు దోచుకున్నాడు. బై బై రిషబ్ పంత్‌. ఇక ఇంటికి వెళ్లి హల్వా, పూరీ తింటూ కూర్చో’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘పంత్‌కు బెస్ట్‌ రీప్లేస్‌మెంట్‌ శాంసన్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తాచాటగల దమ్మున్న ఆటగాడు’ అని మరొకరు ట్వీట్ చేశారు. పంత్‌ కంటే సంజూ బెటర్‌ అని చాలామంది పేర్కొంటున్నారు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్ తరఫున సంజూ శాంసన్‌ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడి 326 పరుగులు చేశాడు. వీటిలో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. కీలక సమయాల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక రిషబ్ పంత్‌ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 217 పరుగులు చేశాడు. కీలక సమయాల్లో అనవసర షాట్లకు పోయి వికెట్ కోల్పోతున్నాడు.

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించే సంజూ శాంసన్‌కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సిన అవకాశాలు రావడం లేదు. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015 జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా భారత జట్టులోకి వచ్చిన శాంసన్​.. మరో అవకాశం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. వరుసగా 8, 2 పరుగులు చేశాడు.

Related posts