telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదు: రేవంత్‌ రెడ్డి

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాతో సీఎం కేసీఆర్‌ పాలనలో ఆయా వర్గాలు ఎలా దగాకు గురయ్యాయో చెప్పామని.. తమ తదుపరి కార్యాచరణ నిరుద్యోగ సమస్యపై ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు ‘విద్యార్థి-నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ పేరుతో ఉద్యమం చేపడతామని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కలలు నెరవేరలేదని రేవంత్‌ ఆరోపించారు.

”2014లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ హామీలు ఇచ్చారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక మారుమూల పల్లెల్లో పాఠశాలలు మూసివేశారు. సీఎం చర్యలతో నిరుపేదలు విద్యకు దూరమయ్యారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఉపాధ్యాయుల నియామకాలు జరగలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

వారి చావులకు కేసీఆర్‌దే బాధ్యత. నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదు. ప్రతి నిరుద్యోగికీ సీఎం రూ.లక్ష బాకీ పడ్డారు. తెలంగాణ ఏర్పడినపుడు ఉన్న ఖాళీల కంటే ఇప్పుడు పెరిగాయి. రాష్ట్రంలో 1.9లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ చేపట్టే ఈ సైరన్‌ ఉద్యమాన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో చేపడతాం. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రతి విద్యార్థి, నిరుద్యోగులు కలిసి రావాలి. తెలంగాణ సమాజం మా ఉద్యమాన్ని ఆశీర్వదించాలి” అని రేవంత్‌ కోరారు.

Related posts