telugu navyamedia
తెలంగాణ వార్తలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు మ‌ర‌ణం తెలుగు వెండితెరకు తీరని లోటు..

*రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
*రెబల్ స్టార్ కృష్ణంరాజు మ‌ర‌ణం తెలుగు వెండితెరకు తీరని లోటు

*ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశం

సినీ దిగ్గజం, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూయడంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది . గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేటి ఉదయం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.

దీంతో రెబల్‌స్టార్‌ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సినిమా ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. 

కాగా  కృష్ణంరాజు మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. 50 ఏండ్ల సినీప్రస్థానంలో తన విలక్షణ నటనాశైలితో కృష్ణంరాజు రెబల్‌స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారన్నారు. ఆయన మరణం తెలుగు వెండితెరకు తీరని లోటన్నారు. 

లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా రాజకీయ పాలనారంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అలాగే కృష్ణంరాజు చనిపోయిన వేళ ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్‌ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఆ మేరకు సీఎం కింది స్థాయి అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు.

Related posts